CM Revanth: వాళ్లు రెచ్చగొట్టినా పట్టించుకోకండి.. రాష్ట్ర ఖ్యాతి పెంచండి

by Gantepaka Srikanth |
CM Revanth: వాళ్లు రెచ్చగొట్టినా పట్టించుకోకండి.. రాష్ట్ర ఖ్యాతి పెంచండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టి ఇప్పటికి 30 వేల జాబ్ రిక్రూట్‌మెంట్ లెటర్లు ఇచ్చామని, ప్రస్తుతం జారీ అయిన నోటిఫికేషన్లతో త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. నియామకాల నినాదంలో భాగంగా విద్యార్థులు, నిరుద్యోగులు రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని చాలామంది ప్రాణత్యాగం చేశారని, ఆ పునాదులపై అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడుతున్నదని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నదని, ఈ ఏడాది రెండు వేల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పన దిశగా కసరత్తు మొదలుపెట్టిందన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులై మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న 135 మంది అభ్యర్థులకు సింగరేణి ఆర్థిక సహకారంతో తలా లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.

‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ, గత ప్రభుత్వంలో వివిధ కారణాలతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా పడిందని, దాన్ని గాడిన పెట్టామన్నారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకుంటున్నదన్నారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో తెలంగాణ నుంచి అత్యధికంగా ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని కోరారు. ఇప్పుడు ఇస్తున్న ఆర్ధిక సాయం కంటే కుటుంబ సభ్యులు అనే విశ్వాసం కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. సచివాలయం తెలంగాణ ప్రజలందరిదీ అనే నమ్మకం కలిగించేందుకే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మెయిన్స్ లోనూ ఆ టార్గెట్ రీచ్ కావాలన్నారు. ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

అభ్యర్థులంతా పరీక్షలపైనే దృష్టి పెట్టాలని, వారి కుటుంబాలకు, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సర్టిఫికెట్ కోర్సులకే విద్య పరిమితమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం రేవంత్.. నైపుణ్యం లేని కారణంగా నిరుద్యోగ సమస్య పెరుగుతున్నదన్నారు. చదువుకు తగిన శిక్షణ లేకపోవడంతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని, దీన్ని విశ్లేషించిన తర్వాతనే యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామన్నారు. కొంతమంది విజ్ఞుల సూచనతో యూనివర్సిటీ నిర్వహణకు ఇండస్ట్రీ డ్రివెన్ విధానాన్ని తీసుకున్నామన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రాను చైర్మన్‌గా నియమించామని, వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి స్కిల్ యూనివర్సిటీ శిక్షణ అందిస్తుందన్నారు.

కొంతమంది పొలిటీషియన్లు విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని, గతంలోనూ ఇదే తరహాలో రెచ్చగొట్టి లబ్ది పొందారని సీఎం గుర్తుచేశారు. అలాంటివారి ఉద్యోగాలను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఓడగొట్టిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పుడు వారికి గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, నిరసనలు, ధర్నాలు సమస్యలకు పరిష్కారం కాదన్నారు. కొంతమంది కుట్రలకు పావులుగా మారొద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలపై సొంతంగా ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రభుత్వం విద్య, ఉద్యోగకల్పన, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నదని గుర్తుచేశారు. సమస్యలేవైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ఒక అన్నగా వాటిని పరిష్కరించే బాధ్యత తనది అని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు.

సివిల్స్ మెయిన్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల చూపు లక్ష్యం వైపు మాత్రమే ఉండాలని, మెయిన్స్ లోనూ ఉత్తీర్ణత సాధించినవారికి కూడా లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈసారి ఒలంపిక్స్ లో మన దేశం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదని, వచ్చే అకడమిక్ ఇయర్‌లో యంగ్ ఇండియా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించి భవిష్యత్తులో క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వసతి గృహాల్లో సరైన మౌలిక వసతులు ఉండటం లేదని గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నామన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్సును ఏర్పాటు చేయబోతున్నామని, జాతీయ స్థాయి ప్రమాణాలతో వసతులు కల్పించబోతున్నామని స్పష్టం చేశారు. రెండు వారాల్లోపు అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్లను నియమిస్తామని, ఖాళీలను కూడా భర్తీ చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story