మోడీ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేడు: సీఎం రేవంత్

by GSrikanth |
TPCC Chief Revanth Reddy Slams CM KCR Over Food in Welfare Hostels
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లన్నీ బంద్ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సూచన మేరకు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు. మూడోసారి పవర్‌లోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లన్నీ రద్దు చేసేందుకు బీజేపీ రెడీ అయిందని వెల్లడించారు. 2025లోగా రిజర్వేషన్లను రద్దు చేయాలనే విధానంతో ఆర్ఎస్ఎస్ ఉన్నదని, దీన్ని బీజేపీ తు.చ తప్పక అమలు చేస్తుందన్నారు. మొండిగా వ్యవహరించి అయినా సరే, రిజర్వేషన్లు రద్దు చేయాలని మోడీ కుట్ర చేస్తున్నారన్నారు. ఇందుకు 2/3 వ వంతు మెజారిటీ సాధించాలని పన్నాగాలు పన్నుతున్నట్లు వెల్లడించారు. అందుకే ఆ పార్టీకి చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. దేశంలో 400 సీట్లు గెలవాలని మోడీ తన ప్రచారంలో పదే పదే అందుకే చెప్తున్నాడని సీఎం వివరించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గురువారం గాంధీభవన్‌లో బీజేపీ పదేళ్ల పాలనపై నయా వంచన పేరిట చార్జిషీట్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేడన్నారు. పెన్సిల్, రబ్బర్లు, ఆఖరికి అగర్ బత్తులకూ జీఎస్టీ వేసిన ఘనత మోడీదన్నారు. ప్రతీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని, ఆ లెక్కన గడిచిన పదేళ్లలో 20 కోట్లు ఉద్యోగాలు రావాల్సి ఉండగా, కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయడం సిగ్గుచేటన్నారు. రైతులకు మేలు చేసేందుకు స్వామి నాథన్ కమిషన్ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోకుండా, కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారన్నారు. నల్లచట్టాలు తీసుకువచ్చి రైతుల చావులకు కారణమయ్యారన్నారు.

అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే నల్లధనం తీసుకువస్తామని చెప్పి, ఉన్న సంపదను ప్రైవేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారన్నారు. ఇక 1947 పంద్రాగస్టు నుంచి 2014 వరకు 67 సంవత్సరాల్లో 14 మంది ప్రధాన మంత్రులు 55 లక్షల కోట్లు అప్పు చేస్తే, 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ ఏకంగా రూ.113 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీఠ వేస్తూ, సామాన్యలకు చుక్కలు చూపిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ తోనే సాధ్యమని, వర్గీకరణ కోసం పోరాడిన లీడర్ ఒకరు ఇప్పుడు సొంత ప్రయోజనం కోసం బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ వైపు నిలబడ్డాడని వివరించారు. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్ రిజర్వేషన్లు రద్దు దిశగా జరగనున్నాయని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed