Harish Rao : అబద్ధాలలో సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ పీహెచ్‌డీ, డాక్టరేట్‌లు ఇవ్వొచ్చు: హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-24 10:57:20.0  )
Harish Rao : అబద్ధాలలో సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ పీహెచ్‌డీ, డాక్టరేట్‌లు ఇవ్వొచ్చు: హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : అబద్దాలు ఆడటంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి డబుల్ పీహెచ్‌డీ, డాక్టరేట్‌లు ఇవ్వొచ్చని మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. అబద్దాలను కూడా పట్టపగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడని, గోబెల్స్ ప్రచారం చేస్తుంటాడన్నారు. హుజురాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పడు అందరిని మోసం చేయలేరని, కర్నాటకలో ఐదు గ్యారంటీలు, తెలంగాణలో ఆరు గ్యారంటీలని ప్రజలను మోసం చేశారని, మహారాష్ట్రలో కూడా ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేయగా, ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను తిప్పికొట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అక్కడ ప్రచారానికి వెళితే వారిని చూసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదన్న సంగతి మహారాష్ట్ర ఓటర్లకు గుర్తు వచ్చిందన్నారు. ఇప్పటికైన రేవంత్ రెడ్డి, మంత్రులు బుద్ది తెచ్చుకుని ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని, బోగస్ మాటలు, ఢిల్లీకి మూటలు బంద్ పెట్టాలని డిమాండ్ చేవారు. రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓడిందన్నారు. ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమలులో లేదని, లగచర్ల ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. హుజురాబాద్ లో దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో మా ప్రభుత్వం డబ్బులు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఫ్రీజ్ చేసి అన్యాయం చేస్తుందన్నారు.

లగచర్లలో ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రీయల్ కారిడార్ అని సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చాడని, ఇదే ప్రభుత్వం జూలై 19న గెజిట్ లో ఫార్మాసిటీ అని పేర్కోన్న సంగతి సీఎం మరిచిపోవడం విడ్డూరమన్నారు. సొంత నియోజకవర్గం ప్రజలను కలిసేందుకు కూడా సీఎం భయపడుతున్నాడన్నారు. అబద్దాల యూనివర్సిటీ ఉంటే డాక్టరేట్ రేవంత్ రెడ్డికి వస్తుందన్నారు. కాళేశ్వరం కూలిపోయిందన్న సీఎం రేవంత్ రెడ్డి 20టీఎంసీల నీటీని అక్కడి నుంచి హైదరాబాద్ కు ఎట్లా తరలిస్తున్నారని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ మంత్రి పదేళ్లలో తెలంగాణ అన్నపూర్ణ అయ్యిందంటే, ఇంకో మంత్రి రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ గేట్లు ఎత్తి లక్ష ఎకరాలను నీరందిస్తానన్నాడన్నారని గుర్తు చేశారు. అంటే కాళేశ్వరం కూలిపోకున్నా గోబెల్స్ ప్రచారం చేశారన్న సంగతి వారి మాటలతో తెలిసిపోతుందన్నారు. 22కాంపోనెంట్లలో ఒక మేడిగడ్డ వద్ద సమస్య వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందనడం దారుణమన్నారు. ప్రజలకు వాస్తవాలు అర్ధమవుతున్నాయన్నారు. మిషన్ భగీరథ పైన కూడా అబద్దాలు ప్రచారం చేశారన్నారు. కేసీఆర్ చొరవతో ఫ్లోరైడ్ రహిత తెలంగాణగా మార్చి ఇంటింటికి నీరందించామన్నారు.

కాంగ్రెస్ 11నెలల పాలనతో కోటీ 60లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండాయని చెప్పుకుంటున్నారని, తెలంగాణ వచ్చినప్పుడు 30లక్షల టన్నులు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి కోటీ 54లక్షలు మెట్రిక్ టన్నులు పండాయన్నది మరువరాదన్నారు. మిషన్ కాకతీయ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విస్తరణ, నిరంతర విద్యుత్తుతోనే అదంతా సాధ్యమైందని, కాంగ్రెసోళ్లు ఇందులో చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ లో ఒక్కటి అమలు కాలేదని, రేవంత్ రెడ్డి మాత్రం రైతులను ఉద్దరించినట్లుగా ఏడాది పాలనలో రైతు ఉత్సవాలు చేయాలని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయలేదని, మద్దతు ధర ఇవ్వడం లేదని, రైతు బంధు ఆగిపోయిందని ఇంకా ఎందుకు రైతు వారోత్సవాలని ప్రశ్నించారు. హుజురాబాద్ దళిత బంధు సమస్యలను డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null