తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక రిక్వెస్ట్

by Gantepaka Srikanth |
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక రిక్వెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్లలో రాష్ట్రంలో ఛిన్నాభిన్నమైన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పునరుజ్జీవం తరహాలోనే పర్యావరణ పునరుజ్జీవనం కూడా జరగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy)... ఆ లక్ష్యం సాకారమయ్యేందుకే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు లేక్‌ సిటీగా పేరు పొందిన హైదరాబాద్‌ నగరం ఇటీవలి కాలంలో ఫ్లడ్స్‌ సిటీగా దిగజారిపోవడానికి కారణం గత పదేళ్ళలో పాలకులు చేసిన పాపమేనని అన్నారు. దాన్ని చక్కదిద్దేందుకు, ప్రక్షాళన చేయడం కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్ని అడ్డంకులొచ్చినా హైడ్రా ఆగదని స్పష్టం చేశారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజాపాలనా దినోత్సవం సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. చెరువులు, నాలాలను కాపాడుకోకపోతే భవిష్యత్‌ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయ తాండవాన్ని చూశామని, హైదరాబాద్‌లో అలాంటిది రాకుండా ఉండాలంటే హైడ్రా యాక్షన్ తప్పనిసరి అని అన్నారు. వేలాది ప్రాణాలు ప్రకృతి ప్రకోపానికి బలయిన ఘటన హైదరాబాద్‌కు రాకూడదన్నారు.

హైడ్రా వెనక ఎలాంటి రాజకీయ కోణం, ఏ రకమైన స్వార్థం లేదని సీఎం నొక్కిచెప్పారు. అది ఒక పవిత్ర కార్యమని, ప్రకృతిని కాపాడుకునేందుకు చేస్తున్న యజ్ఞమని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కొందరు భూ మాఫియాగాళ్లు పేదలను ముందుకు నెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, అవి సాగవన్నారు. హైదరాబాద్‌ నగర భవిష్యత్‌కు హైడ్రా గ్యారెంటీ ఇస్తుందన్నారు. ప్రజలంతా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed