Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ పై నిషేధం.. జంటలతో పాటు ఫొటో, వీడియో గ్రాఫర్లకు షాక్

by Rani Yarlagadda |   ( Updated:2024-10-26 15:40:56.0  )
Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ పై నిషేధం.. జంటలతో పాటు ఫొటో, వీడియో గ్రాఫర్లకు షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు పెళ్లంటే.. ఇల్లంతా చుట్టాల సందడి, మూడు ముళ్లు, ఏడడుగులు, పచ్చని కాపురం. కానీ ఇప్పుడు పెళ్లంటే.. ప్రీ వెడ్డింగ్ షూట్లు(Pre wedding shoot), పెళ్లి(wedding)కి ముందే ఫొటో షూట్ లో రొమాన్స్(Romance) అన్నట్లుగా మారిపోయింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ పేరుతో పెళ్లికి ముందే అసభ్యకరమైన(obscene) పనులు చేయడం, దానికి ఫొటో గ్రాఫర్లు(Photographers) గైడెన్స్ ఇవ్వడం, వాటిని లైక్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇదంతా వివాహ వ్యవస్థకు భంగం కలిగిస్తోందని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సంఘం(Proddatur Arya Vaishya Sangam) అభిప్రాయపడింది. ఇటీవల నిర్వహించిన సభలో.. ఇకపై తమ ఊరిలో ప్రీ వెడ్డింగ్ షూట్ ను నిషేధించాలని తీర్మానించారు. ఈ మేరకు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ.. కరపత్రాలను పంచుతున్నారు.

వేదాలు, సనాతన ధర్మం, హిందూ ధర్మం, శాస్ర్త ప్రమాణాల ప్రకారం మన రుషులు, పెద్దలు యుక్తవయస్కుల కామాన్ని ధర్మంతో ముడిపెట్టి వివాహ బంధాన్ని ఏర్పరిచారని, తద్వారా సంతాన ప్రాప్తి ఉంటుందని ఆ కరపత్రంలో ఆర్యవైశ్యులు పేర్కొన్నారు. జీలకర్ర బెల్లం పెట్టినపుడు ఒకరినొకరు కళ్లలో కళ్లు పెట్టి చూడటం, భౌతిక స్పర్శ జరుగుతాయని తెలిపారు. కానీ.. ట్రెండ్ పేరుతో ప్రీ వెడ్డింగ్ షూట్ లు చేసి.. ఒకరినొకరు హగ్ చేసుకోవడం, ఇతర పనులు చేస్తూ.. విపరీత పోకడలను ప్రదర్శిస్తున్నారని వాపోయారు. వీటన్నింటికీ కారణం ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లేనని మండిపడ్డారు. తమ ఊరిలో ఇకపై ప్రీ వెడ్డింగ్ షూట్ లు చేయకుండా తీర్మానించారు. అలాగే పెళ్లి ముహూర్త సమయంలో ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల హడావిడిని తగ్గించి, గంటపాటు వేదికకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.




Advertisement

Next Story