- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: CM కేసీఆర్‌కి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా బెడిసి కొడుతోన్న వ్యూహాలు!
దిశ, తెలంగాణ బ్యూరో: 'అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి..' అన్నట్టు తయారైంది సీఎం కేసీఆర్ పరిస్థితి. గులాబీ అధినేత వేస్తున్న ప్లాన్లు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. ఫామ్ హౌజ్ కేసు నుంచి మొదలుకొని సెక్రటేరియట్ ఓపెనింగ్ వరకు అనేక ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రిలో అసహనం, చికాకు పెరిగిపోతున్నదని పార్టీలో చర్చ జరుగుతున్నది.
మోడీ టూర్ తెలిసి ముందుగానే ఖమ్మం సభ
వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి జనవరి 17న ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చి, పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తారని లీకులు వచ్చాయి. దీంతో ఆ సభ కంటే ముందుగానే పబ్లిక్ మీటింగ్‌కు కేసీఆర్ ప్లాన్ చేశారు. జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అయితే పీఎం టూర్ క్యాన్సల్ అయింది. కానీ ఆవిర్భావ సభను వాయిదా వేస్తే విమర్శలు వస్తాయనే కారణంతో అనివార్యంగా కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ నిర్వహించాల్సి వచ్చింది.
పీఎం టూర్‌కు పోటీగానే ఇనాగ్రేషన్ ప్లాన్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల ప్రారంభోత్సవానికి ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ టూర్ ఫిక్స్ అయింది. పరేడ్ గ్రౌండ్స్‌లో పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. దీంతో మళ్లీ మోడీ మీటింగ్‌కు కౌంటర్‌గా పబ్లిక్ మీటింగ్ కోసం కేసీఆర్ ప్లాన్ చేశారు. పుట్టిన రోజు ఫిబ్రవరి 17న సెక్రటేరియట్ ప్రారంభించి, పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు.
సీఎం చాంబర్ కోసం ఏర్పాటు చేసిన 6వ అంతస్తును ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లను ఆహ్వానించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షిద్దామనుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా వెనకడుగు వేయలేదు. కానీ ప్రధాని టూర్ వాయిదా పడిందని తెలిసిన తర్వాత.. ఈసీ క్లియరెన్స్ ఇవ్వడం లేదని సాకుగా చూపి సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారని ప్రచారం జరుగుతున్నది.
రివర్స్ కొడుతున్న ఫామ్ హౌజ్ కేసు
ఫామ్ హౌజ్ కేసులో కేంద్ర బీజేపీ లీడర్లను విచారణ కోసం హైదారబాద్‌కు పిలిచేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారు. బీజేపీ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోశ్‌కు నోటీసులు పంపారు. దీనిపై బీజేపీ కౌంటర్ దాఖలు చేసింది. దీంట్లో రాజకీయ కుట్ర దాగి ఉన్నదని, నిష్పక్షపాత విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని వాదించింది. దీనిపై హైకోర్టు ఏకభవిస్తూ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని సీబీఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. అటూ ఇటూ తిరిగి ఈ కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటుందనే అనుమానం వ్యక్తమవుతున్నది.
హైకోర్టు ఆదేశాలతో రిపబ్లిక్ డే
రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య విబేధాల నేపథ్యంలో రిపబ్లిక్ డే నిర్వహణ కోసం సర్కారు ఆసక్తి చూపలేదు. గవర్నర్‌తో కలిసి పాల్గొనాల్సి రావడం ఇష్టం లేకే కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్‌లో సెలబ్రేషన్స్, పరేడ్‌ను క్యాన్సల్ చేశారని, దీనికి కరోనాను సాకుగా చూపారనే చర్చ జరిగింది. గవర్నర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సైతం రాజ్ భవన్‌కే పరిమితం చేశారు. అయితే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రొటోకాల్ అమలు చేయడం లేదని కొందరు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం పరేడ్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం అప్పటికప్పుడు రాజ్ భవన్‌లోనే పరేడ్ ఏర్పాట్లు చేసింది.
గవర్నర్ స్పీచ్‌పై బ్యాక్ స్టెప్
గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్స్‌ను ప్రారంభించేందుకు మొదట ప్రభుత్వం రెడీ అయింది. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి దొరకలేదు. దీంతో ప్రభుత్వం హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వాదనల్లో బడ్జెట్ సెషన్స్‌లో గవర్నర్ స్పీచ్ ఎందుకు లేదనే విషయం ప్రస్తావనకు వచ్చింది. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పడంతో వివాదాన్ని ఇరువర్గాల లాయర్లు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించింది. దీంతో గవర్నర్ స్పీచ్‌కు ప్రభుత్వం అంగీకరించడం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ క్లియరెన్స్ ఇవ్వడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
పెండింగ్‌లోనే కీలక బిల్లులు
గతేడాది సెప్టెంబరులో అసెంబ్లీ ఆమోదించిన బిల్స్ రాజ్ భవన్‌లో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇటీవల హైకోర్టులో ఇరువర్గాల లాయర్ల మధ్య జరిగిన చర్చల తర్వాత పెండింగ్ బిల్స్‌పై గవర్నర్ సంతకం చేస్తారని భావించారు. కానీ ఇంతవరకు ఆ బిల్స్‌పై గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం పంపారని ప్రచారం జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి : ఇరకాటంలో ఈటల.. పక్కా వ్యూహంతోనే 18 సార్లు ప్రస్తావించిన కేసీఆర్?