తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్: Y. S. Sharmila

by Mahesh |   ( Updated:2022-12-03 10:20:54.0  )
తెలంగాణ ద్రోహి సీఎం కేసీఆర్: Y. S. Sharmila
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యమకారుడని రెండు సార్లు కేసీఆర్ కు అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను నిండా ముంచాడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేశాడని, ఉద్యమకారులను కనీసం గౌరవించని దిక్కుమాలిన ప్రభుత్వమిదని మండిపడ్డారు. మలిదశ తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి, శ్రీకాంతాచారి చిత్రపటానికి షర్మిల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరవీరుడు శ్రీకాంతాచారి ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని, శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ ద్రోహం చేశారని అన్నారు. ఓడిపోయే సీటును శ్రీకాంతాచారి తల్లికి ఇచ్చాడని ఓడిపోయాక కనీసం ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

అదే తన బిడ్డ ఓడిపోతే మాత్రం ఆగమేఘాల మీద మళ్లీ ఎమ్మెల్సీని చేశాడని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఉద్యమంలో 1200 మంది అమరులైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 500 మందిని మాత్రమే గుర్తించిందని అందులోనూ కొంత మందికే ప్రభుత్వ ఇండ్లు, రూ.10 లక్షల సాయం చేసిందన్నారు. మిగిలిన 700 మందిని ఉద్యమకారులు కాదని కేసీఆర్ వదిలేశారని ఇది అన్యాయం అని మండిపడ్డారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారితో పాటు కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారని అలాంటి వారిని కూడా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ టీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులను స్వాతంత్ర యోధులుగా గుర్తింపునిచ్చి వారి సంక్షేమానికి నిధులు కేటాయిస్తామని, వారికి ఇండ్లు, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులా..?

తెలంగాణ ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ఈ సందర్భంగా షర్మిల ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఉన్నారా? అంతా ఉద్యమ ద్రోహులే కదా?అని నిలదీశారు. ఉద్యమ నినాదాలకు కేసీఆర్ తూట్లు పొడిచాడని కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి, చిన్న చిన్న పథకాలను నీరుగార్చిండాని ఆరోపించారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వమిదని వైఎస్ఆర్‌కు పేరు వస్తుందనే ఆ ప్రాజెక్టులపై వివక్ష చూపుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని 4 లక్షల అప్పుల కుప్పగా మార్చి కమీషన్లు దోచుకుని కాళేశ్వరం కట్టారని ఇంత చేసినా తాను పాదయాత్రలో ఎక్కడ చూసిన సాగునీళ్లు లేవని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 57 వేల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని ధ్వజమెత్తారు.

నాడు రెచ్చగొట్టి ఈనాడు నోటిఫికేషన్‌లు ఇవ్వలేదు..

నిరుద్యోగులు ఉద్యమిస్తేనే తెలంగాణ ఏర్పడిందని తెలంగాణ ఉద్యమంలో పరీక్షలు రాయవద్దని నిరుద్యోగులను కేసీఆర్ రెచ్చగొట్టారని షర్మిల అన్నారు. రాష్ట్రం ఏర్పడితే మన నోటిఫికేషన్లు మనమే వేసుకుందామని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లక్ష 61 వేల ఖాళీలు ఉన్నాయని పీఆర్సీ కమిటీ చెప్పినా పట్టించుకోకుండా అరకొర నోటిఫికేషన్లు విడుదల చేసి వాటినే గొప్పలుగా చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

కొత్త మండలాలు, కొత్త జిల్లాల్లో నేటి వరకు సిబ్బందిని కేటాయించలేదని అన్ని కలుపుకుంటే రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని వైఎస్సార్ టీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. డిగ్రీలు, పీజీలు చేసిన యువత ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతో టీ, టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటున్నారని యువతులు పత్తి ఏరడానికి వెళ్తున్నారని కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడంలోనూ కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. కార్పొరేషన్‌ల ద్వారా లోన్లు ఇప్పించి స్వయం ఉపాధి కూడా కల్పించలేకపోయారన్నారు.

ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం..

నిఖార్సయిన ఉద్యమకారులను సీఎం కేసీఆర్ ద్రోహం చేశాడని షర్మిల ఆరోపించారు. ఉద్యమాన్ని నడిపించిన ప్రొ.కోదండరాం ను గౌరవించలేదని, ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ కు కనీసం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. జయశంకర్ సార్ కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని కేసీఆర్ కనీసం ప్రతిపాదన కూడా పంపకపోడవంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు పేరు పోతుందనే ఉద్దేశంతోనే మహనీయులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబమంతా దోచుకునే పనిలోనే పడ్డాడని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్లు అప్పులు చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 89 శాతం ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇచ్చి నిధులు దండుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ బోగాలు అనుభవిస్తూ ప్రజలకు కన్నీళ్లు మిగిల్చారని కేసీఆర్ తెలంగాణ ద్రోహి అన్నారు.

రైతులను ఆదుకోవడంలో విఫలమైన కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం నిలువునా దోచుకుందని కేసీఆర్ కుటుంబం పై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాం లో బిడ్డ ఉంది. రియల్ ఎస్టేట్ స్కాంలో కొడుకు ఉన్నాడు. కమీషన్ల స్కాంలో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్ము వెలకట్టలేనిదని అన్నారు. వైఎస్ఆర్ గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ కు లేదని చెప్పారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, రైతు రుణమాఫీ, పోడు భూములకు పట్టాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇలా ఇచ్చిన హామీలన్నింటిని కేసీఆర్ తప్పాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ మోసాల చిట్టాకు అంతులేదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed