సిగ్గు, లజ్జ, పౌరుషం ఉంటే బీజేపీ ఆ పని చేయాలి: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-09-16 13:38:21.0  )
సిగ్గు, లజ్జ, పౌరుషం ఉంటే బీజేపీ ఆ పని చేయాలి: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్/ మహబూబ్ నగర్: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే ప్రధాన మోడీకి చేతకావటం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. శనివారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వగురువు అని చెప్పుకునే మోడీ.. తొమ్మిదేళ్లుగా కృష్ణా జలాల్లో మన నీళ్ల వాటా తేల్చలేదని ఫైర్ అయ్యారు.

పదేళ్లుగా కృష్ణా ట్రిబ్యునల్‌కు ఎందుకు ప్రతిపాదనలు పంపటం లేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రజలు బీజేపీ నేతలను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. చేతనైతే బీజేపీ రాష్ట్ర నాయకులు మోడీ వద్దకు వెళ్లి నీటి వాటా అడగాలని కోరారు. తను ప్రాజెక్టు ఓపెన్ చేయడానికి ఇవాళ వచ్చేటప్పడు.. ఇద్దరు ముగ్గురు పోరగాళ్ళు బీజేపీ జెండా పట్టుకోని బస్సుకు అడ్డమొచ్చారని, నేను ఏం మోసం చేశానని.. ఈ జిల్లా బీజేపీ నేతలకు సిగ్గు, లజ్జ ఉంటే పౌరుషం ఉంటే కృష్ణానదిలో వాటా తేల్చాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్‌, ముంబైలో అడ్డా కూలీ అని.. కానీ ఇప్పుడు ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు వచ్చి పనులు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సం మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల చరిత్రలో ఇవాళ సువర్ణక్షర లిఖితమని అన్నారు. పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా తొలిపాదయాత్ర జోగులాంబ గద్వాల నుంచే చేశానని చెప్పారు. కొందరు నేతల వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇన్నాళ్లు ఆలస్యమైందని మండిపడ్డారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని గత పాలకులపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ ప్రశ్నించలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed