'కారు' గెలుపు కోసం కంటి వెలుగు..!

by Nagaya |   ( Updated:2023-01-03 02:16:42.0  )
కారు గెలుపు కోసం కంటి వెలుగు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్కార్ సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని సుమారు 6 నెలల పాటు నిర్వహించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తోన్నది. ఈ పథకాన్ని సక్సెస్​చేసి ఓటర్ల మదిలో కేసీఆర్​ప్రభుత్వ నినాదాన్ని ఫిక్స్​చేయాలని కసరత్తులు చేస్తోన్నది. ఎక్కువ మందికి మేలు జరిగే స్కీమ్ కావడంతో ప్రభుత్వం ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నది. ప్రతీ ఒక్కరికీ కంటి పరీక్షలు చేయడం ద్వారా ఎన్నికల్లోనూ పార్టీ గుర్తులను ప్రజలు సులువుగా గుర్తించవచ్చనే అభిప్రాయం కూడా సర్కార్​మదిలో ఉన్నది. దీంతో వృద్ధులందరికీ విజన్​టెస్టులు చేసి అవసరమైనోళ్లకు ఆపరేషన్లు, కంటి పరిస్థితిని బట్టి అద్దాలు పంపిణీ చేయనున్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంతో మంది వృద్ధులు, కంటి సమస్యలున్నోళ్లు రోడ్డు రోలర్​గుర్తును కారు సింగల్‌గా భావించి ఓట్లు వేసినట్లు ప్రభుత్వం అనుమానిస్తోన్నది.

గత ఎన్నికల ఫలితాల్లోనూ రోడ్డు రోలర్ గుర్తుకు ఊహించని విధంగా ఓట్లు వచ్చాయి. దీన్ని పసిగట్టిన ప్రభుత్వం ఈ సారి గుర్తులతో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అన్ని గ్రామాల్లో క్యాంపులు పెట్టనున్నది. మొదటి విడత 100 రోజుల యాక్షన్​ప్లాన్‌ను అమలు చేయనున్నారు. పురపాలక, పంచాయతీ రాజ్​శాఖ సహకారం తీసుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ జనరల్​ఎలక్షన్లు ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిన కొన్ని నెలల తర్వాతనే రాగా.. టీఆర్ఎస్​పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. దీన్ని సర్కార్​సెంటిమెంట్‌గా భావిస్తున్నది. దీంతో ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం కావాలని ప్రభుత్వం తిరిగి కంటి వెలుగును ప్రారంభిస్తుందని టీఆర్​ఎస్​పార్టీ ముఖ్య నేతలే వివరిస్తున్నారు.

సీఎం చేతుల మీదుగా..

జనవరి 18న కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు బీఆర్కేభవన్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్లతో మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించనున్నారు. ఇందులో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్స్‌ అంతా పాల్గొనాలని సోమవారమే ఆదేశాలు వెళ్లాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కంటి వెలుగు ద్వారా ప్రభుత్వంపై మద్ధతు పెరిగేలా పాటించాల్సిన సూత్రాలను వివరించనున్నారు. ప్రజా మద్ధతు కూడకట్టుకునేందుకు ప్రత్యేక సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

గతంతో పోల్చితే ఈ సారి కంటి వెలుగు పాత్రలో ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది భాగస్వామ్యం కావాలని సూచించనున్నారు. క్షేత్రస్థాయిలో ఇన్వాల్వ్​ పెరగడం వలన లీడర్‌తో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనేది మంత్రి హరీష్​రావు ప్లాన్. ఈ సమీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులంతా ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల లెవల్​మీటింగ్‌ను ఏర్పాటు చేసుకోనున్నారు. సర్పంచ్‌లు, మునిసిపల్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీల్లో కమిషనర్స్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, వార్డు సభ్యులతో సమీక్షలు నిర్వహించి యాక్షన్​ప్లాన్‌నుకు రూపకల్పన చేయనున్నారు.

16,588 ప్రాంతాలు...

రాష్ట్ర వ్యాప్తంగా 16,588 ప్రాంతాల్లో కంటి వెలుగు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో జనవరి 18 నుంచి జూన్‌ 15 మధ్య కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సుమారు 55 లక్షల మందికి కళ్లద్దాలను పంపిణీ చేయనున్నారు. కేసీఆర్​కంటివెలుగు పేరిట క్యాంపులను పంచాయతీ ఆఫీసులు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల, గ్రంథాలయాలు వంటి చోట్ల ఏర్పాటు చేయనున్నారు. క్యాంపుల ఏర్పాటు బాధ్యతను గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పంచాయతీ అధికారి, మునిసిపాలిటీల్లో మునిసిపల్‌ కమిషనర్‌కు అప్పగించారు. అవసరమైన షామీయానాలు, టేబుల్స్‌, కుర్చీలు, మంచినీరు, టాయిలెట్స్‌తోపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సర్కారు ఆదేశించింది.

ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది అప్తమాలజీ డాక్టర్లు భాగస్వామ్యం కానున్నారు. ఇతర టెక్నిషియన్లు, సపోర్టెట్​స్టాఫ్​కూడా ఉంటారు. క్యాంపునకు వారం ముందే డీఎమ్​హెచ్​వోలు కంటి వెలుగు కిట్లను సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, యూపీహెచ్‌సీలకు పంపుతారు. ఏఆర్‌ మిషన్స్‌ ట్రయల్‌ లెన్స్‌ బాక్స్‌లు, స్నేలెన్‌చార్జ్‌, రీడింగ్‌ గ్లాసెస్స్‌ ఉంటాయి. వీటితో పాటు కంటివెలుగు కార్యక్రమం కోసం రెండు వేల ట్యాబ్స్‌ను క్షేత్రస్తాయి వైద్య సిబ్బందికి అందజేయనున్నారు. ఈ ట్యాబ్స్‌లో కంటివెలుగుకు సంబంధించిన డేటా అంతా ఆన్‌లైన్‌ ద్వారా ఎంట్రీ చేస్తారు.

Also Read..

ఎన్నికలే టార్గెట్‌గా కేసీఆర్ సర్కార్ కీలక సర్వే.. ఈ అంశాలే టాస్క్


Advertisement

Next Story

Most Viewed