ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. పక్కా ప్లాన్‌తో మంత్రులను రంగంలోకి దించిన CM..!

by Satheesh |   ( Updated:2023-11-06 02:53:19.0  )
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. పక్కా ప్లాన్‌తో మంత్రులను రంగంలోకి దించిన CM..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గులాబీ బాస్‌కు కామారెడ్డి భయం పట్టుకుంది. ఆ నియోజకవర్గంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టేందుకు తంటాలు పడుతున్నారు. కులాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలకు ఏకంగా మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. వారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. విపక్షాలను కట్టడిచేయడంలో భాగంగానే కేసీఆర్ ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా ఇక్కడ అమలుకు శ్రీకారం చుట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గాన్ని కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇప్పటి వరకు ఆయన ఏ సెగ్మెంట్‌లో పోటీ చేసినా గెలుపు ఈజీ అయింది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం కష్టిపడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆ నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తారని, సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావించి అండగా నిలిచేవారు. కానీ ప్రస్తుతం ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువైంది. స్థానిక నేతల వ్యవహారశైలి, గ్రూపుల లొల్లితో కిందిస్థాయి నేతలు, కేడర్ సైతం ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ ప్రచార రథాలను సైతం అడ్డుకుంటుండం, పార్టీ నేతల మధ్య సయోధ్య లేకపోవడం తలనొప్పిగా మారింది. దీంతో కేసీఆర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.

మంత్రులతో కుల సమ్మేళనాలు

కేసీఆర్ సూచనల మేరకు మంత్రులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు సొంత నియోజకవర్గాల్లోనే ప్రచారానికి పరిమితం అయినవారు ప్రజెంట్ కామారెడ్డిలో ప్రచారం చేస్తున్నారు. వారి కులస్తులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఒక్క రోజే నాలుగు ప్రధాన కులస్తులతో మంత్రులు భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ముస్లిం మైనార్టీలతో మంత్రి మహమూద్ అలీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మైనార్టీలకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నది కేసీఆర్ అని, రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌తోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమని వెల్లడించారు.

కేసీఆర్ సర్కార్‌ను మరో సారి దీవించాలని కోరారు. ముఖ్యమంత్రిని నియోజకవర్గ ఓటర్లు భారీ మెజారిటీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఇక గౌడ కులస్తులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముదిరాజ్ కులస్తులతో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రెడ్డి కులస్తులతో వేముల ప్రశాంత్ రెడ్డి వేర్వేరుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. మిగిలిన అన్ని కులస్తులతో కూడా ఆయా కమ్యూనిటీలకు చెందిన మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. అంటే కేసీఆర్ గెలుపుకోసం, ఏ స్థాయిలో ప్రచారానికి కష్టపడాల్సి వస్తుందో స్పష్టం అవుతోంది.

అసమ్మతిని పోగొట్టే ప్లాన్

ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత విపక్షాల వైపునకు మళ్లకుండా కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా వర్గాలకు పదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గ్రామాల వారీగా, నేతలతో లబ్దిదారుల వారీగా కలిసి వివరించే ప్లాన్ చేస్తున్నారు. ఏ ఒక్క ఓటు చీలకుండా వ్యూహాలను రచిస్తున్నారు. ఏ గ్రామంలో వ్యతిరేకత ఉంది, దానిని పోగొట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరు వ్యతిరేకిస్తున్నారనే వివరాలను సేకరించి, అసమ్మతికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. వారిని నేరుగా కలిసి అసమ్మతిని పోగొట్టే ప్లాన్ చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఏ మేరకు కట్టడి చేస్తారనేది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed