తలకాయ తెగిపడ్డా తెలంగాణలో ఆ పని జరనివ్వం: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-11-01 11:36:21.0  )
తలకాయ తెగిపడ్డా తెలంగాణలో ఆ పని జరనివ్వం: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి ప్రైవేటైజైషన్ పిచ్చి పట్టుకుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టుమంటున్నదని.. కానీ దానికి బీఆర్ఎస్ సర్కార్ ససేమిరా అన్నదని తెలిపారు. తలకాయ తెగిపడ్డా కానీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రానికి తేల్చి చెప్పామన్నారు. రూ.25 వేల కోట్లు నష్టం వచ్చిన భరిస్తాం కానీ.. మోటార్లకు మీటర్లకు పెట్టబోమని మోడీ ప్రభుత్వానికి చెప్పామని కేసీఆర్ అన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. ఇల్లందు చాలా ఉద్యమాలు జరిగిన పోరాటాల గడ్డ అని.. ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యవంతులని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

ఒక ఒరవడిలో కొట్టుకుపోకుండా మీకు మీరుగా ఆలోచించి ఓటేయాలన్నారు. విచక్షణతో ఓటేసినప్పుడే ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారని అన్నారు. మంచి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుంది.. చెడు ప్రభుత్వం వస్తే చెడు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని పనులు జరిగాయో మీకు తెలుసు.. ఇల్లందులో 48 వేల ఎకరాల పోడు భుములు ఇచ్చామని తెలిపారు. గిరిజనులకు పెద్ద ఎత్తున పోడు పట్టాలు ఇచ్చామన్నారు. ఖమ్మం జిల్లాలో కొంత మందికి డబ్బు వచ్చాక అహంకారం పెరిగింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గడప తొక్కనివ్వమని ప్రతిజ్ఞ చేస్తున్నారు.. అసలు అసెంబ్లీకి పంపేది మీరా.. వాళ్లా అని ప్రశ్నించారు. మీ ఓటే మీ వజ్రాయుధమని.. మీ భవిష్యత్‌ను మార్చేది మీ ఓటేనని అన్నారు. ఏ పార్టీ ఏం చేసిందో ఆలోచించి వచ్చే ఎన్ని్కల్లో ఓటు వేయాలని కేసీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed