‘ఫ్రంట్‌’‌లో ముందుకు పడని కేసీఆర్ అడుగులు.. సైలెంట్‌గా పార్టీ వ్యవహారాలపైనే ఫోకస్!

by GSrikanth |   ( Updated:2023-04-18 05:53:11.0  )
‘ఫ్రంట్‌’‌లో ముందుకు పడని కేసీఆర్ అడుగులు.. సైలెంట్‌గా పార్టీ వ్యవహారాలపైనే ఫోకస్!
X

నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ‌ స్టాండ్‌తో మరో కూటమి అవసరమని ముందు నుంచి చెబుతున్న సీఎం కేసీఆర్.. ప్రస్తుతం ఆ విషయంలో కాస్త వెనుకబడినట్టు తెలుస్తున్నది. దీంతో అదే నినాదాన్ని నెత్తినెత్తుకున్న బీహార్ సీఎం నితీశ్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో చర్చలు జరిపిన ఆయన.. త్వరలోనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ సమావేశం కానున్నారని టాక్. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్న గులాబీ నేతలు.. ఆయన సంప్రదించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెబుతున్నారు. మరి భవిష్యత్తులో ప్రధాని కావాలనే ప్లాన్‌లో ఉన్న నితీశ్‌కు కేసీఆర్ సపోర్ట్ చేస్తారా? కేసీఆర్‌తో కలిసి నడిచేది ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలన్న పిలుపు ఆచరణలో సాధ్యం కావడం లేదు. ఒకవైపు కాంగ్రెస్ తన కూటమి పార్టీలను పటిష్టంగా ఉంచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు ఏ కూటమితో సంబంధం లేకుండా విడిగా ఉంటున్న పలు ప్రాంతీయ పార్టీల నేతలు తీసుకునే వైఖరి జాతీయ స్థాయిలో కీలకంగా మారింది. ఈ పరిస్థితుల్లో నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ చొరవ తీసుకున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో చర్చలు జరిపిన నితీష్ కుమార్ త్వరలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ చర్చించనున్నట్టు అక్కడి మీడియా ప్రతినిధులకు లీకులు ఇచ్చారు. వాస్తవానికి బీజేపీ వ్యతిరేక పొలిటికల్ ఫైట్‌ను తొలుత తెరపైకి తీసుకొచ్చి ఫ్రంట్ పాలిటిక్స్‌కు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం కేసీఆర్. కానీ.. ఇప్పుడు మెయిన్ ఫోకస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌ వైపు మళ్లింది. కేసీఆర్ పోషించాల్సిన నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ యాక్టివిటీని నితీష్ కుమార్ టేకప్ చేశారు. కేసీఆర్ సహకారం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. అది ఏ మేరకు ఫలప్రదం అవుతుందనే సందేహాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా నితీశ్ కుమార్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో చర్చలు జరిపే విషయం తమకు తెలియదని, అటువైపు నుంచి సమాచారం అందిన తర్వాత తమ వైఖరిపై క్లారిటీ ఇవ్వడం వీలవుతుందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

ప్రధానిగా నితీశ్‌కు చాన్స్?

జాతీయ రాజకీయాల్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య ఫ్రంట్ పాలిటిక్స్ మొదలయ్యాయి. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే వ్యూహాలను కేసీఆర్ చాలాకాలం కిందటే రెడీ చేసుకున్నారు. కానీ ప్రస్తుతం ఆయన కొంచెం స్లో అయ్యారు. తాజా పరిణామాలతో బీహార్ సీఎం నితీశ్ నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ ఫ్రంట్ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలంటూ విపక్ష పార్టీలన్నీ గట్టిగా పిలుపు ఇస్తున్నా ప్రాక్టికల్‌గా మాత్రం అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఏకం చేసే బాధ్యత తీసుకున్న నితీష్ కు కేసీఆర్ సహకారం ఇస్తారా..? సైలెంట్‌గా ఉండి దూరం పాటిస్తారా? అనే ఆసక్తి నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్ కూటముల్లో లేని ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉంటే.. రానున్న ఎన్నికల్లో ఈ కూటమే కింగ్ మేకర్‌గా ఆవిర్భవిస్తుందనే చర్చలు జరుగుతున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం చొరవ తీసుకుంటున్న నితీశ్ కుమార్ కు ప్రధాని అయ్యే అవకాశం కూడా లేకపోలేదని టాక్. గత కొంతకాలంగా ఏ పార్టీతోనూ అంటీముట్టనట్లుగా ఉన్న కేసీఆర్ మదిలో ఏమున్నదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నితీశ్‌తో కలిసేనా?

విపక్ష పార్టీలతో నితీశ్ జరుపుతున్న సమావేశాలను గమనిస్తున్న బీఆర్ఎస్ లీడర్లు తమ అభిప్రాయాలు ఓపెన్‌గా చెప్పేందుకు ఆసక్తి చూపడం లేదు. ‘నితీశ్ నుంచి మాకు ఇప్పటిదాకా ఫోన్ రాలేదు. ఆయన మాతో మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడిన తర్వాత మా వైఖరి చెబుతాం’ అని ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉండే ఓ లీడర్ తెలిపారు. నితీశ్‌కు దూరంగా ఉండేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తారని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రధాని కావాలనే ప్లాన్‌లో ఉన్న నితీశ్‌కు కేసీఆర్ ఎలా సపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. నితీశ్‌కు ప్రాధాన్యం లభిస్తున్న పరిస్థితుల్లో నలుగురిలో ఒకరిగా ఉండడానికి కేసీఆర్ సిద్ధపడకపోవచ్చన్నారు.

కేసీఆర్‌తో జతకట్టేదెవరు?

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమి ఏర్పాటు అవరసమని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. విపక్ష పార్టీల కదలికలు మాత్రం కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉండే కూటమివైపే ఉన్నాయి. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, నితీశ్‌ కుమార్, కేసీఆర్, నవీన్ పట్నాయక్ లాంటి నేతలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీతో దూరంగా ఉన్నారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ ప్రస్తుతానికి మౌనంగా ఉన్నారు. నితీశ్ కుమార్ చొరవ తీసుకున్నారు. నవీన్ పట్నాయక్ బీజేపీకి అంశాలవారీ మద్దతు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ మూడో కూటమిలో చేరడం అనుమానంగా మారింది. ఒంటరి పోరాటానికే సిద్ధమవుతున్న కేసీఆర్‌తో ఏ పార్టీలు కలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ ఏ నిర్ణయమూ తీసుకోని సమాజ్‌వాదీ పార్టీ, జేడీఎస్‌లు కేసీఆర్‌తో కలుస్తాయా? నితీష్ కుమార్ కూటమికి జైకొడతాయా..? అనే చర్చ కూడా జరుగుతున్నది. నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ పార్టీల నేతలతో చర్చిస్తున్న నితీశ్.. ఇటీవల ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గేతోనూ భేటీ కావడం చర్చనీయాంశంమైంది. వీలైతే నాన్ బీజేపీ స్టాండ్‌తో కొన్ని పార్టీలతో కాంగ్రెస్ జరిపే చర్చలు వర్కవుట్ కావన్న ఉద్దేశంతో నితీశ్ రంగంలోకి దిగారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నితీశ్ ప్రయత్నాలన్నీ తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్‌ వైపు తిప్పడానికే అన్న భావనతో కేసీఆర్, అఖిలేష్ యాదవ్, కుమారస్వామి లాంటి నేతలు విడిగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని జాతీయ నేతల సమాచారం.

Read more:

అధికారమే లక్ష్యంగా BRS ప్లాన్.. రంగంలోకి పోలీసు యంత్రాంగం.

ఎంఐఎం, కమ్యూనిస్టుల తోకలు కట్ చేసిన సీఎం.. క్రెడిట్ అంతా కేసీఆర్ ఖాతాలోనే..!

Advertisement

Next Story

Most Viewed