ఆ ధాన్యం అమ్మితే క్రిమినల్ కేసు: సివిల్ సప్లై చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ వార్నింగ్

by Satheesh |
ఆ ధాన్యం అమ్మితే క్రిమినల్ కేసు: సివిల్ సప్లై చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కోసం రైస్‌ మిల్లర్లకు సివిల్ సప్లై సంస్థ కేటాయించిన ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్న, ఎవరైనా కొనుగోలు చేసినా నేరమేనని.. అమ్మిన, కొనుగోలు చేసిన ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ విజిలెన్స్‌ అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్ల సమాచారం అందిస్తే తగిన పారితోషికంతో పాటు వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సోమవారం సివిల్ సప్లై భవన్‌లోని తన కార్యాలయంలో ఆ సంస్థ విజిలెన్స్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిపిన తనిఖీల్లో ముఖ్యమైన అంశాలను అధికారులు చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏఆర్‌ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 2021 - 22లో 2 సీజన్లలో 11,427 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేటాయిస్తే 9,523 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లు యజమాని అమ్ముకున్నారని, దీని విలువ దాదాపు 18 కోట్లు ఉంటుందని అధికారులు చైర్మన్‌ దృష్టికి తీసుకొచ్చారు. కేవలం 2 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సీఎంఆర్‌ ఇచ్చారని తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలోని సుద్దాల స్టేజ్‌ 1 గోదాం ఘటనపై మరింత లోతైన విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారులు తమ తనిఖీలను మరింత విస్తృతం చేయాలని, ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకుంటున్న మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed