జమిలీ ముసుగులో కబళించాలని చూస్తున్నారు.. బీజేపీపై సీఎం హాట్ కామెంట్స్

by Prasad Jukanti |   ( Updated:2024-09-21 08:12:54.0  )
జమిలీ ముసుగులో కబళించాలని చూస్తున్నారు..  బీజేపీపై సీఎం  హాట్  కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమిలీ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికల తో బీజేపీ ఈ దేశాన్ని కబళించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. శనివారం రవీంద్రభారతిలో జరిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి పై పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు యునియన్ ఆఫ్ స్టేట్స్ భావనను దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన ఈ చారిత్రాత్మకమైన సందర్భంలో సీతారాం ఏచూరి మన మధ్య లేకపోవడం కమ్యూనిస్టు పార్టీలకే కాకుండా ఈ దేశానికే తీరని లోటు అని సీఎం అన్నారు. భాషలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటున్న బీజేపీ విధానాలను సీతారాం ఏచూరి ఆలోచన విధానలతో నిలువరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

మోడీ స్పందించకపోవడంపై ఫైర్..

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించకపోవడం బీజేపీ ఫాసిస్టు విధానాలను సూచిస్తున్నాయని సీఎం అన్నారు. వీధి రౌడి మాట్లాడినట్లుగా కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే ఇది తప్పు అని చెప్పేందుకు పెద్దమనిషిలా వ్యవహరించే సీతారాం ఏచూరి లాంటి వ్యక్తి లేకపోవడం ప్రజాస్వామ్యానికి నష్టం అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తి కోసం సీతారాం ఏచూరి కృషి చేశారని, బతికున్నంత వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడే వారు చాలా అరుదుగా ఉంటారని అన్నారు. రాజకీయాల్లో ప్రజాప్రతినిధులుగా ఎదిగేందుకు ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతం కొరకు ఇవ్వరు. సీతారాం ఏచూరితో మాట్లాడుతుంటే కి.శే జయపాల్ రెడ్డితో మాట్లాడుతున్నట్లు ఉండేదని. రాహుల్ గాంధీతో, గాంధీ కుటుంబంతో ఏచూరికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే తెలుగు వారి సంఖ్య తగ్గుతోంది. విద్యార్థి దశనుంచే సీతారాం ఏచూరి అంచెలంచెలుగా ఎదుగుతో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు.

ఏచూరి సమయస్ఫూర్తికి నిదర్శనం:

ఈ దేశ రాజకీయాల్లో యునైటెడ్ ఫ్రండ్ ఏర్పాటులో జైపాల్ రెడ్డితో పాటు ఏచూరిది కీలక పాత్ర అని అలాగే యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వ ఏర్పాటుతో పాటు పేదల కోసం అనే పథకాలు తీసుకురోవడంలో ఏచూరి ముఖ్య పాత్ర పోషించారన్నారు. కేళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఎన్నికలలో పోరాటం చేసినా జాతీయ స్థాయిలో మాత్రం కలిసి పని చేసి బీజేపీ శక్తులను నిలువరించేందుకు ఏచూరి సమయస్ఫూర్తితో పని చేశారన్నారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు. కానీ సీతారాం ఏచూరి మాత్రం తాను నమ్మిన సిద్ధాంత కోసం ఆఖరి శ్వాస వరకు బతికడమే కాకుడా మరణానంతరం ఆయన భౌతికకాయాన్ని పరిశోధనకు ఇచ్చారంటే ఏచూరి నిజంగా ఈ దేశం కోసం అంకితం అయ్యారని కొనియాడారు. విలువలు, సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో సీతారాం ఏచూరి లేకపోవడం నిజంగా బాధాకరం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed