ప్రైవేటు వర్సిటీల బిజినెస్‌కు చెక్! ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

by Rajesh |
ప్రైవేటు వర్సిటీల బిజినెస్‌కు చెక్!  ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. యాజమాన్యాల ఇష్టారాజ్యానికి పుల్ స్టాప్ పెట్టేందుకు చట్టాన్ని కూడా సవరించాలని భావిస్తున్నది. వచ్చే అకాడమిక్ (2024–25) ఇయర్ రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నది. మరోవైపు రెవెన్యూ శాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీలపై చర్యలు తీసుకునే చాన్స్ ఉన్నట్టు తెలుస్తున్నది.

బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణ

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రైవేటు వర్సిటీల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. నిర్దేశించిన ఫీజు చెల్లించిన వారికి అడ్మిషన్లు ఇస్తున్నారు. దీంతో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కావాల్సిన చట్ట సవరణ చేయాలని సర్కారు భావిస్తున్నది.

ఫిబ్రవరిలో నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాల్లో సవరణ బిల్లుకు ఆమోదం తీసుకుని, 2024–25 అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లను అమలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రైవేటు వర్సిటీల్లో అమలవుతున్న రిజర్వేషన్లు, వర్సిటీల కార్యకలాపాలపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది.

ఫీజుల నియంత్రణ కోసం కమిటీ

ప్రస్తుతం వర్సిటీల్లో ఏ కోర్సుకు ఎంత ఫీజు ఉండాలనే అంశంపై ప్రభుత్వ నియంత్రణ లేదు. పూర్తిగా వర్సిటీల యాజమాన్యాల పరిధిలోనే ఉన్నది. దీంతో లాభాలే టార్గెట్ గా ఫీజులు వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వం భావిస్తున్నది. స్టూడెంట్స్‌కు అందుతున్న సౌకర్యాలు, వసూలు చేస్తున్న ఫీజుల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు ప్రభుత్వానికి అందిన రిపోర్టులో వెల్లడైన్నట్టు తెలిసింది. చాలా కోర్సుల్లో క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ లేదని గుర్తించినట్టు సమాచారం.

ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ఫీజు నియంత్రణ లేకుండా యాజమాన్యాల ఇష్టారాజ్యానికి వదిలేసిందని విమర్శలు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఫీజుల నియంత్రణ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు నియంత్రణ కమిటీల సిఫార్సుల మేరకు ఫీజులను నిర్ధారిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు వర్సిటీల్లో కూడా ఫీజు నిర్దారణ అనేది నియంత్రణ కమిటీల పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది.

అనురాగ్, మల్లారెడ్డి వర్సిటీలపై చర్యలు?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన అనురాగ్, మల్లారెడ్డి వర్సిటీల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్టు చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. వర్సిటీ ఆధీనంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నట్టు తాజాగా రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై సమగ్ర విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఆ భూములను వెనక్కి తీసుకోవడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించినందుకు వర్సిటీలపై చర్యలు తీసుకునే చాన్స్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed