Kishan Reddy: పారా మిలటరీ జవాన్లతో దీపావళి వేడుకలు.. ఐపీఎస్ కృష్ణప్రసాద్ హత్యను గుర్తుచేసిన కేంద్రమంత్రి

by Rani Yarlagadda |
Kishan Reddy: పారా మిలటరీ జవాన్లతో దీపావళి వేడుకలు.. ఐపీఎస్ కృష్ణప్రసాద్ హత్యను గుర్తుచేసిన కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: 140 కోట్ల మంది దేశ ప్రజల కోసం.. పండుగలు, శుభకార్యాలను త్యాగం చేసి కాపలా కాస్తున్న జవాన్ల సేవలు మరచిపోలేనివన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పారా మిలటరీ బలగాలతో కలిసి ఆయన దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భార్య కావ్యతో కలిసి వారికి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి (G.Kishan Reddy) మాట్లాడుతూ.. కుటుంబాలను వదిలి.. నిరంతరం దేశ సేవలో ఉంటోన్న సాయుధ బలగాలకు, వారి కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా అందరి భద్రత కోసం అహోరాత్రులు శ్రమిస్తోన్న సైనికుల సేవ మరువలేనిదని కొనియాడారు. సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

దేశంలో పదేళ్ల వెనక్కి వెళ్లి చూస్తే.. ఎక్కడ చూసినా ఉగ్రవాదుల అలజడి, బాంబు దాడి ఘటనలే కనిపిస్తాయన్నారు. సికింద్రాబాద్ లో ఐపీఎస్ కృష్ణప్రసాద్ (IPS Krishna Prasad)ను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనను గుర్తుచేశారు. పలు సందర్భాల్లో చాలామంది వీరమరణం పొందారని తెలిపారు. పార్లమెంట్ భవనం పైనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని, అలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడటమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మోదీ సర్కార్ పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను ఒక్కొక్కటిగా రూపుమాపుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలతో.. గత పదేళ్లలో దేశంలో ఎలాంటి ఉగ్రఘటనలు జరగలేదన్నారు. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, వారిని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం, ఇందుకోసం వ్యూహాత్మక విదేశీ విధానాన్ని అవలంబించడం వల్ల మన దేశం ఆ గడ్డు సమస్యనుంచి బయటకు వచ్చిందని కిషన్ రెడ్డి వివరించారు.

దేశంలో శాంతియుత వాతావరణం ఉన్నపుడే అభివృద్ధికి బాటలు పడుతాయన్నారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న సంకల్పంతో మోదీ ముందుకెళ్తున్నారన్నారు. ఇందుకోసం దేశమంతా శాంతియుత వాతావరణంలో కొనసాగడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఇందులో సాయుధ బలగాల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు.

Advertisement

Next Story