‘నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా’.. కలెక్టర్లకు CCLA నవీన్ మిట్టల్ వార్నింగ్

by Satheesh |
‘నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా’.. కలెక్టర్లకు CCLA నవీన్ మిట్టల్ వార్నింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మీకు ఉద్యోగం చేయాలనుందా..? లేదా..? వారం రోజులుగా ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారు..? తహశీల్దార్లు, ఆర్డీవోలు ఏం చేస్తున్నారు..? విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ చేస్తానంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ధరణి అప్లికేషన్ల పరిష్కారం ఎంత వరకు వచ్చిందని తెలుసుకునేందుకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 14వ తేదీన వీడియో కాన్ఫరెన్స్‌లోనే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినా పట్టించుకోని వారిపై మండిపడ్డారని తెలిసింది. యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంతో సీరియస్ అయ్యారని సమాచారం.

వారంలో 37 అప్లికేషన్లు కూడా పరిష్కరించని కలెక్టర్లు ఉన్నారు. ఓ జిల్లాలో 800లకు పైగా పెండింగ్ మ్యుటేషన్ అప్లికేషన్లు ఉంటే పట్టించుకోలేదు. ఇలాంటి వారిని సస్పెండ్ చేస్తానంటూ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఊగిపోయారని తెలిసింది. తహశీల్దార్లు, ఆర్డీవోలు అసలేం చేస్తున్నారని, కలెక్టర్లు కూడా ఏం పర్యవేక్షిస్తున్నారంటూ మండిపడ్డారని ఓ అధికారి నుంచి అందిన సమాచారం. ఆఖరికి కోర్టు ఇంటిమేషన్లను కూడా అమలు చేయకుండా పెండింగ్ పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే తహశీల్దార్లను, ఆర్డీవోలను సస్పెండ్ చేయాలని.. కలెక్టర్లు చేయలేకపోతే తానే సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఆర్డర్ కాపీలు పంపిస్తానన్నారని తెలిసింది. మిషన్ మోడ్‌లో ఈ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. సీఎం ప్రజావాణి ద్వారా వచ్చే అప్లికేషన్లను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. వీటిపై కలెక్టర్లు ప్రత్యక్ష్య పర్యవేక్షణ ఉండాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో సీసీఎల్ఏ కార్యాలయం నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్, సీఎమ్మార్వో వి.లచ్చిరెడ్డి, జిల్లాల నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

ఇంతే పరిష్కారం

గత వారం రోజుల నుంచి కేవలం 24,778 దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేశారు. అంటే డ్యాష్ బోర్డులో క్లియర్ అయ్యాయి. వాటిలో రిజెక్ట్ చేసినవే అధికం. ఇప్పటికీ 2,34,626 దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు సమాచారం. వీటిలో తహశీల్దార్ల దగ్గర 1,48,182, ఆర్డీవోల దగ్గర 53,478, అదనపు కలెక్టర్ల దగ్గర 20,451, కలెక్టర్ల దగ్గర 12,405 వంతున పెండింగులోనే ఉన్నాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 14,556, కరీంనగర్ 9962, మేడ్చల్ 10 వేలు, నాగర్ కర్నూలు 9178, నల్లగొండ 21,693, రంగారెడ్డి 36,463, సంగారెడ్డి 16,824, సిద్ధిపేట 10,077, భువనగిరి 10,132 వంతున పెండింగులో ఉన్నాయి. ఇక సీఎం ప్రజావాణి నుంచి వచ్చిన అప్లికేషన్లలోనూ ఈ జిల్లాలే టాప్‌లో ఉన్నాయి.

వరంగల్ జిల్లాకు 354 వస్తే అన్నీ పెండింగులో చూపించారు. మహబూబ్ నగర్‌లో 302 వస్తే 251 పెండింగ్, కొత్తగూడెంలో 249 గాను 232, హన్మకొండలో 379 కి గాను 379, హైదరాబాద్‌లో 596 కి 596, మేడ్చల్ లో 1194 కి 1154, నాగర్ కర్నూలులో 396 కి 396, నల్లగొండలో 646 కి 637, రంగారెడ్డిలో 2033 కి 1763 అప్లికేషన్లు పెండింగులో ఉన్నట్లు తెలిసింది. ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్లను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా కొందరు కలెక్టర్లు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్లు ఈ లెక్కలే చెప్తున్నాయి. రానున్న ఈ వారం రోజుల్లోనైనా ఎంత మేరకు దరఖాస్తులను పరిష్కరిస్తారో చూడాలి. ఐతే అధికారుల ఒత్తిడి కారణంగా డ్యాష్ బోర్డు క్లియరెన్స్‌కి మొగ్గు చూపిస్తున్నారు. అంటే పరిష్కారానికి బదులుగా రిజెక్ట్ కొట్టేస్తున్నారన్న ఫిర్యాదులు అనేకం వస్తున్నాయి. రైతుకు న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed