పల్లెల్లో మొదలైన ఇందిరమ్మ కమిటీల కోలాహలం

by Aamani |
పల్లెల్లో మొదలైన ఇందిరమ్మ కమిటీల కోలాహలం
X

దిశ, ఆలూర్ : జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు.గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్‌ పరిధిలో వార్డుల వారిగా ఇందిరమ్మ కమిటీలకు సభ్యుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కమిటీ సభ్యుల ఎంపికను కొనసాగించడంతో పాటు మహిళలతో పాటు ఇతర సభ్యులను నియమిస్తున్నారు. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత కలెక్టర్‌ జాబితాను ప్రకటించనున్నారు. ఈ కమిటీల కోసం గ్రామాల్లో పోటీ భారీగా పెరిగింది. అధికార పార్టీకి చెందిన నేతలు పోటీ పడుతున్నారు.

కమిటీలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర నేతల ద్వారా జాబితాను సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో పనిచేసిన వారికి ఈ కమిటీలో చోటు కల్పిస్తున్నారు. మొదటి నుంచి ఉన్న నేతలతో పాటు కొత్తగా చేరిన వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో కమిటీల కోసం పోటీ కూడా బాగా పెరగడంతో నేతలు గొడవలు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.నిబంధనల మేరకు అధికారులు ఒకటి రెండు రోజుల్లో ఈ జాబితాను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కమిటీ చైర్మన్‌గా ప్రత్యేకాధికారి..

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీల ఎంపిక కోసం ఈనెల 10న జీవోను విడుదల చేసింది. అన్ని గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో సభ్యులను ఎంపిక చేయాలని కోరింది. జిల్లాలో మొత్తం 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో కమిటీల ఎంపిక దాదాపు పూర్తి కావస్తోంది. మున్సిపాలిటీలోనూ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ లేదా స్పెషల్‌ ఆఫీసర్‌ చైర్మన్‌గా ఉంటారు. గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా కొనసాగుతారు. వీరిద్దరూ కాకుండా ఐదుగురు సభ్యులను ఎంపిక చేస్తున్నారు. వీరిలో మహిళా గ్రూపు నుంచి ఇద్దరు సభ్యులతోపాటు గ్రామాభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తున్న ఎస్సీ, ఎస్టీ నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు, ఇతరుల నుంచి ఒకరికి నియమిస్తారు. మొత్తంగా ఏడుగురిని సభ్యులుగా నియామకం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోకు అనుగుణంగా ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు మున్సిపాలీటీలు, కార్పొరేషన్‌ పరిధిలో కూడా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

కార్పొరేషన్‌ పరిధిలో డివిజన్‌ వారిగా మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఈ ఇందిరమ్మ కమిటీలను ఎంపిక చేస్తున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌ వ్యవహరిస్తారు. ఆ డివిజన్‌ లేదా వార్డుకు సంబంధించిన అధికారి కన్వీనర్‌గా ఉంటారు. ఆ డివిజన్‌ లేదా వార్డు పరిధిలోని సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌కు చెందిన ఇద్దరు మహిళలను, ఎస్సీ, ఎస్టీ నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు, ఇతరుల నుంచి ఒకరిని నియమిస్తున్నారు. నిబంధనల ప్రకారం కమిటీలో చైర్మన్‌, కన్వీనర్‌తో కలిసి మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటున్నారు. గ్రామాల్లో సర్పంచులు లేనందున ప్రత్యేక అధికారులే చైర్మన్‌గా కమిటీలు వేస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో సభ్యులను ఎంపిక చేస్తూ మండల ఎంపిడివో ఆధ్వర్యంలో ఆయా గ్రామాల జాబితాను కలెక్టర్‌కు పంపిస్తున్నారు. మున్సిపార్టీల్ల పరిధిలో వార్డులు, డివిజన్‌ల వారిగా వచ్చే కమిటీల జాబితాను కమీషనర్‌లు కలెక్టర్‌కు పంపిస్తున్నారు. వీటిని పరిశీలించిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో ఆయన ఇందిరమ్మ కమిటీల జాబితాను పైనల్‌ చేయనున్నారు.

కమిటీలో స్థానం కోసం పోటీ..

జిల్లాలో ఈ ఇందిరమ్మ కమిటీల ఎంపికకు భారీ పోటీ నెలకొంది. అధికార పార్టీకి చెందిన ఎక్కువ మంది కమిటీలో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పార్టీ నేతలకు సంబంధించిన వారు కమిటీలో ఉండే విధంగా చూసుకుంటున్నారు. కొన్ని మండలాల పరిధిలో పోటీ ఎక్కువగా ఉండగా మరికొన్ని మండలాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారి వల్ల పోటీ మరింత పెరిగింది. పాత కొత్త కలయికతో కమిటీ సభ్యులను ఎంపిక చేస్తున్నారు. కొన్నిచోట్ల వివాదాలకు తావివ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా జాబితాలను ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కమిటీ సభ్యుల పాత్ర ఉండటంతో లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు అయిన తర్వాత పూర్తయ్యేంతవరకు కమిటీలు పనిచేయాల్సి ఉండటంతో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట పార్టీ ఇన్‌చార్జిలు కూడా క్యాడర్‌కు అవకాశం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో జాబితాలు సిద్ధం కాగా పోటీ ఎక్కువగా ఉండటంతో నేతలు కొంత మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో జాబితా ఫైనల్‌ చేసి ఇందిరమ్మ కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. జిల్లా ఇంచార్జి మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లి జాబితాను ఫైనల్‌ చేయనున్నట్ల తెలుస్తోంది. ఇందిరమ్మ కమిటీల పోటీ మాత్రం ఎక్కువ ఉండటంతో పార్టీ నేతలు కూడా తమ అనుచరులకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో అధికారులు కూడా అధికార పార్టీ నేతల సూచనలు పాటిస్తూ కమిటీల ఎంపికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.కమిటీల ప్రకటన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక చేసే అవకాశం ఉంది.

ఇందిరమ్మ కమిటీలతోనే ప్రజలకు న్యాయం : ఆలూర్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముక్కెర విజయ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేయడం శుభ సూచితం, ఈ కమిటీల ద్వారా నిజమైన లబ్దిదారులకు ఉపయోగం కలుగుతుంది.ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.

Advertisement

Next Story

Most Viewed