హైదరాబాద్ లో కులగణన ప్రారంభం.. 9 నుంచి సర్వే

by Y.Nagarani |
హైదరాబాద్ లో కులగణన ప్రారంభం.. 9 నుంచి సర్వే
X

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణన బుధవారం గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరుతో ప్రభుత్వం దీనిని చేపడుతోంది. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బందితో ఇంటింటికి తిరిగి ఇండ్లపై హౌజ్ లిస్టింగ్ స్టిక్కర్లను అంటించారు. ముందుగా స్టిక్కర్లను అంటించిన తర్వాత రోజు 9వ తేదీ నుంచి కులగణన మొదలౌతుంది. సుమారు 75 ప్రశ్నలతో ఈ సర్వే చేపట్టనున్నారు. ఇందులో 56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సంఖ్య, చదువు, ఆదాయం, బ్యాంక్ ఖాతాలు, పెళ్లి సమయంలో వయస్సు, పిల్లల వయస్సు, ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, భూమి, కులవృత్తి, ఇంటిమీద ఉన్న అప్పు, కులాంతర వివాహాలు వంటివి సేకరించి ప్రభుత్వానికి నివేధిక అందించనున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ సిబ్బంది, ప్రభుత్వ ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం గడచిన పదేళ్లలో కులగణన జరగడం ఇది రెండవసారి. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో కులాల లెక్కలు తీసిన విషయం తెలిసిందే.

మూడు రోజుల పాటు స్టిక్కరింగ్..

సుమారు 150 ఇండ్లకు ఒక పర్యవేక్షణాధికారితో బల్దియా సిబ్బంది, ఉపాధ్యాయులు సర్వే చేపడుతున్నారు. ఇందులో భాగంగా మొదటి మూడు రోజులు ఇండ్లపై హౌజ్ లిస్టింగ్ స్టిక్కర్‌లు అంటిస్తున్నారు. సర్వే మొత్తం పార్ట్ 1, పార్ట్ 2 కింద ఎనిమిది పేజీలలో సమాచారం సేకరించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇండ్లపై స్టిక్కర్ వేసే సమయంలో సర్వే ఏ తేదీన మొదలౌతుందో చెప్పి ఆ రోజు అందుబాటులో ఉండి తమతో సహకరించాలని సిబ్బంది ప్రజలను కోరుతున్నారు. సర్వేలో భాగంగా ప్రజల నుంచి ఎలాంటి దృవపత్రాలు, ఫోటోలు తీసుకోరని, ఇంటి యజమాని ఉండి వివరాలు తెలిపితే సరిపోతుంది. 30 రోజుల గడువులో సర్వే పూర్తి కానుంది.

జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలలో దర్శనమిస్తున్న ఖాళీ కుర్చీలు..

గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కులగణన సర్వే కోసం ప్రభుత్వం బల్దియా సిబ్బందిని నియమించడంతో సర్కిల్ కార్యాలయాలు అధికారులు, సిబ్బంది లేకుండా బోసీపోతున్నాయి. దాదాపు చాలా కార్యాలయాలలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. దీంతో పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చిన వారు ఇబ్బందుల పాలవుతున్నారు. వారికి సమాధానం చెప్పే వారు కూడా కరువయ్యారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story