డబ్బుల పంపిణీకి నయా ప్లాన్.. ఈసీకి నిఘాకు చిక్కకుండా అభ్యర్థుల కొత్త ఎత్తుగడ..!

by Satheesh |   ( Updated:2023-11-29 10:37:24.0  )
డబ్బుల పంపిణీకి నయా ప్లాన్.. ఈసీకి నిఘాకు చిక్కకుండా అభ్యర్థుల కొత్త ఎత్తుగడ..!
X

దిశ, వెబ్‌డెస్క్: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలందరూ పోల్ మేనేజ్మేంట్‌పై సీరియస్‌గా దృష్టి సారించారు. డబ్బు, మద్యం, గిఫ్టులు, గృహోపకరణాలు ఇలా తాయిలాలను ఓటర్లకు ముట్టజెప్పి పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేపారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక లీడర్లు ఆయా నియోజకవర్గాల్లో తాయిలాల పంపిణీలో బిజీ అయిపోయారు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓటుకు రూ.500, రూ.1000, రూ.2000 పంపిణీ చేస్తున్నారు. ప్రత్యర్థి నుండి పోటీగా టఫ్‌గా ఉంటే ఓటుకు ఎంతైన ఇచ్చేందుకు నేతలు వెనకాడటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా విచ్చల విడిగా డబ్బు, మద్యం పంచుతున్నారు.

మంగళవారం సాయంత్రం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గడువు ముగయడంతో నేతలంతా.. ఇక పోల్ మేనేజ్మేంట్‌పై ఫోకస్ పెట్టారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం గతం కంటే ఎక్కువగా పకడ్భందీ చర్యలు చేపట్టింది. డబ్బు పంపిణీని అడ్డుకునేందుకు భారీగా ఎలక్షన్ స్వ్కాడ్, ప్లయింగ్ స్క్వాడ్, అబ్జర్వర్లను, పోలీసులను రంగంలోకి దింపింది. నియోజకవర్గాలు, జిల్లా, స్టేట్ బార్డర్ల వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేస్తోంది. దీంతో అభ్యర్థులకు ఎన్నికల తాయిలాల పంపిణీ కాస్త కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈసీ నిఘాకు దొరకకుండా డబ్బు పంపిణీకి అభ్యర్థులు కొత్త ఎత్తుగడ వేశారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, భారత్ పే ఇతర మనీ ట్రాన్స్‌ఫర్ యాప్‌ల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈసీ తమ ఖాతాలపై నిఘా పెట్టడంతో అభ్యర్థులు వ్యూహాం మార్చారు. పార్టీ కార్యకర్తలు, నమ్మకస్తులు, అనుచరులు ఇలా తమకు నమ్మకమైన వారికి ఈ పనిని అప్పగించారు. వారి ఖాతాల్లో డబ్బు జమ చేసి.. వారి ఫోన్ల నుండి ఓటర్లకు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా డబ్బు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వీరి ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా ఓటర్లకు ఈజీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.

ఒక్కరి ఖాతాలోనే ఎక్కువ నగదు జమ చేసిన మళ్లీ ఈసీకి దొరికిపోతామనే అనుమానంతో పదుల సంఖ్యలో నమ్మకస్తుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి.. వారి ద్వారా ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారు. 50 మంది, 100 మంది ఓటర్లను గ్రూపులుగా డివైడ్ చేసి.. ఆ పని ఒక్కరికి అప్పజెప్తుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఈసీ సైతం మనీ ప్రవాహానికి అడ్డు కట్ట వేయడం కుదరడం లేదు. రూ.500, రూ. 1000 ఇలా తక్కువ మొత్తంలోనే నమ్మకస్తుల ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేయిస్తుండటంతో పెద్దగా అనుమానం సైతం రాదు. ఇలా టెక్నాలజీని ఉపయోగించుకుని అభ్యర్థులు అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నారు.

గ్రామాల్లో కొందరు ఫోన్ పే, గూగుల్ పే వంటివి వాడని వారికి నేరుగా నగదు, మద్యం పంచుతున్నారు. కొందరు ఓటర్లు ఈ యాప్‌ల గురించి తమకు అవగాహన లేకపోయిన.. తమ కొడుకులు, కూతుర్ల ఫోన్లకు డబ్బులు పంపిండి అని చెప్పడం గమనార్హం. ఇక, తమకు అనూకూలంగా ఉన్న చోట అభ్యర్థులు నేరుగా వారి కార్యకర్తలను ఓటర్లకు ఇంటికి పంపుతున్నారు. నేరుగా డబ్బులు ఇచ్చి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈసీ నిఘా, పోలీసుల బందోబస్తు ఎక్కువగా ఉన్నచోట మాత్రం అభ్యర్థులు వ్యూహాత్మంగా ఆన్‌లైన్ ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా.. అభ్యర్థుల ప్రలోభాలకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో డిసెంబర్ 3 వరకు వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed