రియల్​ ఎస్టేట్ వ్యాపారుల కోసమే జీవో 111 ఎత్తివేత.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్

by Javid Pasha |   ( Updated:2023-05-19 15:40:12.0  )
రియల్​ ఎస్టేట్ వ్యాపారుల కోసమే జీవో 111 ఎత్తివేత.. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వం రియల్​ ఎస్టేట్​ వ్యాపారుల చేతుల్లో బందీ అయ్యిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్​ చుట్టుపక్కల వేల ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసిన కేసీఆర్ బినామీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల మెప్పు కోసమే 111 జీవో ను ఎత్తివేశారని విమర్శించారు. 111 జీవో ఎత్తివేయడం వల్ల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కాకతీయ వర్సిటీ భూముల ఆక్రమణ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన పోలీసులే రాజకీయ నేతల అండతో దర్జాగా కబ్జా చేశారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వర్సిటీ భూముల ఆక్రమణపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. భూ అక్రమార్కులపై చర్యలు తీసుకోని పక్షంలో కాకతీయ వర్సిటీ భూముల పరిరక్షణ కోసం బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

గత తొమ్మిది ఏళ్లుగా బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించి, బీసీ కమిషన్ కోరలు తీసేసిన సీఎం కేసీఆర్ కు బీసీల అభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. చేతివృత్తులు, కులవృత్తులకు బడ్జెట్లో కేటాయించిన సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించి బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. బీసీలపై సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దెదించే వరకు బీఎస్పీ ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

సీఎం కేసీఆర్ తో కలిసి నాందేడ్ వెళ్లిన ఆర్మూర్ ఎమ్మెల్యే

Advertisement

Next Story

Most Viewed