CM రేవంత్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ..

by Rajesh |
CM రేవంత్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ..
X

దిశ, తెలంగాణ బ్యూరో : గత పదేళ్లు చేతినిండా పనులతో కళకళలాడిన చేనేతరంగం.. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలని సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో.. మళ్లీ కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే అలాంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. కేవలం గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్ల నేడు నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు, పవర్ లూమ్ ఆసాములతో పాటు కార్మికులు రోడ్డున పడ్డారని, సాంచాలను తూకం వేసే అమ్ముకునే దుస్థితి వచ్చిందని రోజురోజుకూ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు.

కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈ పరిస్ధితి దాపురించిందన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపైన అక్కసు వలన, వాటిని ఆపేడంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయయన్నారు. అయినా ప్రభుత్వానికి కనీస కనికరం లేదన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు కొనసాగించాలని అనేక విజ్ఞప్తులు, అందోళనలు చేసినా స్పందించకపోవడం వల్లనే నేడు దారి లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఉసూరుమంటున్న నేతన్నలకు పని లేక మళ్లీ ఆకలి చావులే దిక్కైన స్థితి నెలకొందని, ఆకలి బాధ తట్టుకోలేక ఆత్మగౌరవం చంపుకోలేక తనువు చాలిస్తున్నారన్నారు. ఇప్పటివరకు 10 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఈ కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారిన సిరిసిల్లలో కార్మికులను ఆదుకునేందుకు రూ.50 లక్షలతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి కేసీఆర్ పేద నేతన్నలకు అండగా నిలిచారు. చేనేత మిత్రా, నేతన్నకు చేయూత, నేతన్న బీమా వంటి కార్యక్రమాలు ప్రారంభిరన్నారు. గతంలో ఇతర రాష్ర్టాలనుంచి సరఫరా అయ్యే, రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లును రాష్ర్టంలోని నేతన్నలకు ఇచ్చి, చేతి నిండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పని కల్పించిందన్నారు. మగ్గాల ఆధునికీకరణ, రుణాల మాఫీ, మార్కెట్ తో అనుసంధానం వంటి ఆల్ రౌండ్ అప్రోచ్ తో ముందుకు సాగిందని, వీటన్నింటి వలన కార్మికులకు ఊరట లభించడంతో, వీరికి మరింత పని కల్పించడంతోపాటు, కడుపునిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన బతుకమ్మ చీరల పథకం ప్రారంభించింది. దీంతోపాటు రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా వారికి ఇవ్వడంతో కార్మికులకు మరింత ఉపాధి పెరిగి ఏడాదికి దాదాపు ఎనిమిది నెలల వరకూ వరుస ఆర్డర్లు అందడంతో.. పరిశ్రమలో సంతోషం వెల్లివిరిసింది. నేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఈ పథకాలు, కార్యక్రమాల వలన ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులీనిందని, దీంతో ఆనాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగిపోయాయన్నారు.

సంక్షోభం నుంచి గట్టెక్కిందనుకున్న చేనేత రంగం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమను దెబ్బతీయడంతోపాటు.. కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారు వెంటనే తన తీరు మార్చుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవర్ లూమ్స్, నేత పరికరాలపై 90 శాతం సబ్సిడీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వాధీనంలో ఉండే సంస్థలకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తిని నేతన్నలకు అప్పగిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్రా, థ్రిప్ట్, యారన్ సబ్సిడీ, నేతన్న ఫించన్లు, నేతన్న బీమా, విద్యుత్ సబ్సిడీ మొదలైన పథకాలను కొనసాగిస్తూ వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నదన్నారు. లేకుంటే బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం, నేత కార్మికుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed