రెండో రోజు కూడా జనాదరణ కరువు…వెలవెలబోయిన నరెడ్కో ప్రాపర్టీ షో

by Kalyani |
రెండో రోజు కూడా జనాదరణ కరువు…వెలవెలబోయిన నరెడ్కో ప్రాపర్టీ షో
X

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో కొనసాగుతున్న నేషనల్ రియలేస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ( నరెడ్కో) 14వ ఎడిషన్ ప్రాపర్టీ షో రెండో రోజు కూడా వెలవెలబోయింది. మొదటి రోజు పెద్దగా స్పందన లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన ఎగ్జిబిటర్లు రెండవ రోజు శనివారం ఫ్యామిలీతో కలిసి జనాలు ప్రాపర్టీ షోకు వస్తారని, మంచి ఊపు ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినా మొదటి రోజు లాగే రెండో రోజు కూడా వారికి నిరుత్సాహం తప్పలేదు. అడపాదడపా వచ్చిన జనాలు కూడా ప్రాపర్టీల గూర్చి తెలుసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఆయా రియలేస్టేట్ కంపెనీలు లక్షల రూపాయలు చెల్లించి స్టాల్స్ ఏర్పాటు చేసి, భారీ సంఖ్యలో సేల్స్ ప్రమోటర్లను పెట్టుకుని ఖాళీగా కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనాలు లేక చాలా స్టాల్స్ ఖాళీగా కనిపించాయి. గతంలో నిర్వహించిన ప్రాపర్టీ షోలకు ఎంతో కొంత జనాదరణ లభించినా ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా నగర వాసుల నుంచి కనీస ఆదరణ కరువైంది. పెద్దగా ప్రచారం లేకపోవడం, మీడియాలో కూడా హడావిడి లేకపోవడంతోనే నరెడ్కో ప్రాపర్టీ షో ఉసూరుమంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.

అంతా అయోమయం..

హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో శుక్రవారం ప్రారంభమైన 14వ ప్రాపర్టీ షో మొదటి రోజే హట్టర్ ప్లాప్ అయింది. రెండవ రోజు కూడా అదే కంటిన్యూ అయింది. స్టాళ్లు కూడా పెద్దగా లేక పోవడంతో ప్రాపర్టీ షోకు వచ్చిన ఆ కొంతమంది కూడా తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. కనీస ప్రచారం కూడా కల్పించకపోవడం, జనాలు భారీగా వస్తారని ఆశలు పెట్టుకున్నా… అనుకున్న మేర రాకపోవడంతో ఉసూరుమన్నారు. మా ప్రాపర్టీలు ఎలాగూ అమ్ముడుపోతాయనే అతి నమ్మకం, కొందరు నరెడ్కో ప్రతినిధుల ఏకఛత్రాధిపత్యం తో ప్రాపర్టీ షో హట్టర్ ప్లాప్ గా మిగిలిపోయిందని, కనీస ఆదరణ కూడా కరువయిందని షోలో స్టాల్స్ ఏర్పాటు చేసిన పలువురు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు కనీసం మీడియా పరంగా కూడా పెద్దగా ప్రచారం కల్పించలేదని ఇలా అయితే షో కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దేనికని పెదవి విరుస్తున్నారు.

ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతాం.. డిప్యూటీ సీఎం భట్టి


హైదరాబాద్ నగరాన్ని ప్రపంచస్థాయి నగరాలలో ఒకటిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, నగరంలో జరుగుతున్న అభివృద్ధి పై గత కొద్ది నెలలుగా కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైటెక్స్ లో జరుగుతున్న నరెడ్కో 14వ ఎడిషన్ ప్రాపర్టీ షోలో రెండవ రోజు పాల్గొన్న మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందుకోసం రూ.10వేల కోట్లను కేటాయించామని, ఇది కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మాత్రమేనని తెలిపారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన భవిష్యత్తును అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు.

సకల సౌకర్యాలతో అద్భుతమైన టవర్స్ నిర్మిస్తామని, వారి పిల్లల మెరుగైన చదువులకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా నిర్మిస్తామని తెలిపారు. హైడ్రాపై దుష్ప్రచారం నడుస్తుందన్న భట్టి విక్రమార్క హైడ్రా ఎలాంటి అనుమతులు ఇవ్వదని జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏ, డీటీసీపీ వంటి ప్రభుత్వ సంస్థలు మాత్రమే అనుమతులు ఇస్తాయని స్పష్టం చేశారు. 30 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed