- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
BRS : నాడు ఆంక్షలు.. నేడు బడ్జెట్ సెషన్‌లో బీఆర్ఎస్ సభ్యుల ఉల్లంఘన
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీల ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూ ఆ పార్టీ నేతలే చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలోనూ అదే ప్రతిబింబిస్తున్నది. గడచిన పదేండ్లలో ప్రతిపక్ష సభ్యులకు చట్ట సభల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం గగనం అని, విమర్శిస్తే మైక్ కట్ చేసేవారని, ప్రశ్నిస్తే సస్పెండ్ చేసేవారని, నిరసన ప్రదర్శిస్తే డిస్‌క్వాలిఫై చేసేవారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో చెప్పారు. చట్టసభల్లో బీఆర్ఎస్ పెట్టిన నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి తీరును సమర్థించుకున్న గులాబీ నేతలు ఇప్పుడు ఆ నిబంధనలనే ఉల్లంఘించి అసెంబ్లీలో స్వేచ్ఛగా నిరసనలు చేశారు. తొమ్మిది రోజుల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకుపోవడం, చప్పట్లతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం, ప్లకార్డులను ప్రదర్శించడం, నేలపై కూర్చుని నిరసన వ్య క్తం చేయడం.. ఇలాంటివి ఎన్ని చేసినా సస్పెన్షన్, డిస్‌క్వాలిఫై లాంటివి చోటుచేసుకోలేదు.
అప్పుడు అలా.. ఇప్పుడు నిరసనలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం సంయమనంతో ప్రతిపక్షాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సహనాన్ని ప్రదర్శించారు. మూడు రోజుల పాటు బీఆర్ఎస్ సభ్యుల నిరసనలపై పలు పార్టీలకు చెందిన సభ్యులు సస్పెన్షన్ వేటు వేయాలంటూ ప్రతిపాదించినా స్పీకర్ మాత్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. పూర్తి ప్రజాస్వామ్యయుతమైన పద్ధతిలోనే వ్యవహరించారని, నిష్పక్షపాతంగా సభను నడిపించారనే ప్రశంసలూ వినిపించాయి. అధికార కాంగ్రెస్ సభ్యులకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ఎక్కువ సేపు మాట్లాడే అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గురించి మాటల్లోనేకాక ఆచరణలోనూ ఆ స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని ఒక దశలో స్పీకరే స్వయంగా చెప్పారు. పదేండ్లలో ప్రతిపక్షాల నోళ్లను నిబంధనల రూపంలో కట్టడి చేయడాన్ని సమర్థించుకున్న గులాబీ ఎమ్మెల్యేలే (అప్పట్లో మంత్రులు) ఇప్పుడు నిరసనలకు పాల్పడడం గమనార్హం.
అప్పట్లో కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు
గత ప్రభుత్వంలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లను ఏకంగా స్పీకర్ డిస్‌క్వాలిఫై చేశారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారనే పేరుతో వీరిపై అప్పటి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఆనాడు ఇలాంటి అంశాలనే పరిగణనలోకి తీసుకుని ప్రతిపక్ష సభ్యులపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసినా ఇప్పటి సమావేశాల్లో గులాబీ ఎమ్మెల్యేలు వారు అమలు చేసిన నిబంధనలనే ఉల్లంఘించడం విశేషం. అప్పట్లో ఆంక్షలను సమర్థించుకున్న మాజీ మంత్రులే ఇప్పుడు వాటిని బేఖాతర్ చేశారు. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సభ్యుల గొంతు నొక్కిన నేతలే ఇప్పుడు ఆ మాట్లాడే హక్కు కావాలంటూ నినాదాలు చేయడం ఎమ్మెల్యేల మధ్యనే చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ సభ్యులకే అవకాశం
తొమ్మిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల గణాంకాలను పరిశీలిస్తే 38 మంది సభ్యుల బలమున్న బీఆర్ఎస్ తరఫున పలువురు ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై మొత్తం 12.57 గంటల పాటు మాట్లాడితే కాంగ్రెస్ సభ్యులు మాత్రం దానికంటే తక్కువ గా 12.45 గంటలకే పరిమితమయ్యారు. సంఖ్యాబలం రీత్యా చూస్తే 65 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీకి మరింత టైమ్ మాట్లాడేందుకు అవకాశమున్నది. కానీ ప్రతిపక్షానికే స్పీకర్ ఎక్కువ సమయాన్ని కేటాయించారు. దీనికి తోడు బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు, ఆందోళనలు, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలనే పేరుతో రెండుంబావు (2.16 గంటలు) గంటల సమయాన్ని వృథా చేశారు. ఇక సభా నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ కంటే దాదాపు గంట సేపు మజ్లిస్ శాసనసభాపక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. సీఎం రేవంత్ 4.54 గంటలసేపు మాట్లాడితే అక్బరుద్దీన్ మాత్రం 5.41 గంటల సేపు మాట్లాడారు.
20 గంటల పాటు సభా కార్యక్రమాలు
సభ్యుల విషయానికి వస్తే ఏడుగురున్న మజ్లిస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు 7.34 గంటలు మాట్లాడితే వారికంటే ఒక ఎమ్మెల్యే ఎక్కువగా ఉన్న బీజేపీ సభ్యులు 5.55 గంటల సేపు మాట్లాడారు. కౌన్సిల్‌లో సైతం మంత్రులు మాట్లాడిన సమయంకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎక్కువ టైమ్ తీసుకున్నారు. మంత్రులంతా కలిపి ఐదున్నర గంటలు మాట్లాడితే బీఆర్ఎస్ సభ్యులు 6.24 గంటల సేపు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ సభ్యులు మాత్రం కేవలం 3.37 గంటలసేపుకే పరిమితమయ్యారు. ఆరు రోజుల పాటు జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో 20 గంటల పాటు సభా కార్యక్రమాలు జరగ్గా అందులో దాదాపై ఐదో వంతు బీఆర్ఎస్ సభ్యుల ప్రసంగాలకే సరిపోయింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ఉన్నదనే విశ్వాసానికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభు త్వంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలు, విమర్శలకు అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ వెసులుబాటు ఇవ్వడం, ఎక్కువసేపు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం గమనార్హం.