BRSని కూకటివేళ్లతో పెకిలించాలి.. : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-27 07:05:09.0  )
BRSని కూకటివేళ్లతో పెకిలించాలి.. : దుద్దిళ్ల శ్రీధర్ బాబు
X

దిశ, మల్హర్: కాంగ్రెస్‌తోనే పేదలకు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి పూర్తిస్థాయిలో అందుతాయని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం రాత్రి మండల కేంద్రంలోని తాడిచెర్ల, కాపురం గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అబద్దాల మేనిఫెస్టో ప్రజల ముందుకు వచ్చి మూడోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి ఆమెకు కృతజ్ఞతలు తెలిపే బాధ్యత మనపై ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఆరు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం తూచా తప్పకుండా అమలు చేస్తామని ప్రజలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఇస్తూ రూ.500లకే గ్యాస్ కనెక్షన్ అందిస్తామని తెలిపారు. అదే విధంగా రూ.5 లక్షలతో ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని, రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు రూ.15 వేలు వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఏడాదికి ఒకసారి అందిస్తామని ఆయన తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 2 వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు, యువ వికాస్ ద్వారా విద్యార్థులకు రూ. ఐదు లక్షల విద్య భరోసా కార్డులు అందించనున్నట్లు, మండల కేంద్రాలలో తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

చేయూత పథకం కింద రూ. 4 వేల పెన్షన్స్, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలు పెంచుతామని తెలుపుతూ ఇలాంటి పథకాలు కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల సంక్షేమానికి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు కేసీఆర్ ప్రభుత్వం గతంలో ప్రకటించిన మేనిఫెస్టో ఏనాడు సక్రమంగా అమలు చేసిన సందర్భాలు లేవని మళ్లీ సాధ్యం కానీ కొత్త మేనిఫెస్టో ఓటర్లకు ఎంతకైనా మోసానికి దిగజారుతాడని ఆయన మోసాలకు మోసపోకూడదని ప్రజలకు ఆయన తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాశ్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ దండు రమేష్, ఎంపీపీ చింతలపల్లి మలహల్రావు, జడ్పీటీసీ ఐతకొమల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితల రాజయ్య, తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed