మైనంపల్లిపై BRS నో యాక్షన్.. బుజ్జగించేందుకు రంగంలోకి గులాబీ కీలక నేత..!

by Satheesh |   ( Updated:2023-08-27 05:23:03.0  )
మైనంపల్లిపై BRS నో యాక్షన్.. బుజ్జగించేందుకు రంగంలోకి గులాబీ కీలక నేత..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ ఎమ్మెల్యే టికెట్ తన కొడుకు‌కు రాకుండా మంత్రి హరీశ్ రావు అడ్డుకుంటున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన కామెంట్స్ పార్టీలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయనపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. కానీ పార్టీ పెద్దలు మైనంపల్లి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది.

ఆయనను దారిలోకి తెచ్చుకునేందుకు ఉన్న మార్గాలను ఆరా తీస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను పార్టీ నుంచి పంపేస్తే ఆ ప్రభావం రెండు, మూడు సెగ్మెంట్లపై పడుతుందని అధిష్టానం భయపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అందుకే ఆయన ఘాటుగా విమర్శలు చేస్తున్నా.. గులాబీ పెద్దలు చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉంటున్నారనే అనుమానం పార్టీ శ్రేణులను వెంటాడుతున్నది.

రంగంలోకి కీలక నేత

మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్టును అధిష్టానం కట్టబెట్టినా ఆయన సంతృప్తి చెందలేదు. కొన్ని రోజులుగా పార్టీ నేతలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తున్నది. అదే జరిగితే రెండు, మూడు అసెంబ్లీ సెగ్మంట్‌లో బీఆర్ఎస్‌పై ప్రభావం పడే చాన్స్ ఉన్నది.

దీంతో సీఎం కేసీఆర్ మైనంపల్లిని బుజ్జగించేందుకు ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. సదరు నేతపై మైనంపల్లికి మొదటి నుంచీ మంచి అభిప్రాయం ఉన్నదని టాక్. ఆ నేత రంగంలోకి దిగిన తర్వాత మైనంపల్లి బీఆర్ఎస్‌ను వీడాలనే నిర్ణయాన్ని మార్చుకుంటారని అధిష్టానం ఆశిస్తున్నది.

మండిపడుతున్న హరీశ్ వర్గం

హరీశ్‌రావుపై తీవ్ర విమర్శలు చేసిన మైనంపల్లి విషయంలో ఇంతవరకు పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మంత్రి హరీశ్‌రావు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనంపల్లి విమర్శలు చేసిన వెంటనే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని అంతా ఆశించారు. కానీ వారం రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు. పైగా ఆయనను బుజ్జగించేందుకు ఓ కీలక నేతను రంగంలోకి దింపడంతో హరీశ్ రావు అనుచరులు షాక్ అయినట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed