కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం ఏర్పాటు కాగానే జాయినింగ్..?

by Satheesh |
కాంగ్రెస్‌లోకి 12 మంది BRS ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం ఏర్పాటు కాగానే జాయినింగ్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి.. ప్రభుత్వ ఏర్పాటును ఖాయం చేసుకున్న కాంగ్రెస్ వైపు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నట్టు వారి అనుచరుల ద్వారా లీకులు వెలువడుతున్నాయి. గతంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో సంబంధాలు ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యేలుగా గెలిచిన కొద్దిమంది ఈ లిస్టులో ఉన్నట్టు టాక్. రేవంత్ రెడ్డితో వారికి ఉన్న సంబంధాలే కారణమనే తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో చేరితే నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు వస్తాయని, సొంత బిజినెస్‌కూ ఎలాంటి ఆటంకాలు ఉండవనే ఆలోచనలో ఉన్నట్టు ఆ లీకుల సారాశం. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఎక్కువగా ఈ కేటగిరీలో ఉన్నట్టు సమాచారం. వెంటనే పార్టీ మారకుండా లోక్ సభ ఎన్నికల సమయంలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్.

పార్టీ మారడమే బెటర్

అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతాయని, సెగ్మెంట్ అభివృద్ధి సాధ్యమవుతుందని వారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. కానీ లోపల మాత్రం వారు వేరే ఉద్దేశంతో ఉన్నారనేది మరో వాదన. రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్ లాంటి ఏదో ఒక రకమైన వ్యాపారం ఉన్న నేతలు పార్టీ మారితేనే బెటర్ అని, సొంత వ్యాపారాలకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా చూసుకునే వీలుంటుందనే ప్లాన్‌లో ఉన్నట్టు టాక్. పదవులను ఆశించి కాంగ్రెస్‌లో చేరాలనే ఉద్దేశం కన్నా వ్యాపారాలను, ఆస్తులను, కాపాడుకోవడమే వారికి పెద్ద టాస్క్ అనేది వారి బలమైన వాదన.

ఎన్నికల ప్రచారం సమయంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే మేలుకోవాలని భావిస్తున్నారు. ట్రిపుల్ వన్ జీవో, ధరణి పోర్టల్, భవన నిర్మాణాలకు పురపాలక శాఖ ఇచ్చిన అనుమతుల్లో అవకతవకలు, వివిధ ప్రాజెక్టులో పొందిన కాంట్రాక్టులు.. వీటన్నింటిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కావని భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనంలో విశ్వాసం పెంచేందుకైనా ఆ పని చేస్తారనే అనుమానం వారిని వెంటాడుతున్నది. ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోయినా సందర్భం చూసుకుని నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

అప్పుడు అవసరాల కోసం బీఆర్ఎస్‌లోకి..

వీరిలో కొందరు గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నవారే. ఆనాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారం పార్టీలో ఉండాలనే భావనతోనే బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు అధికారం కాంగ్రెస్ చేతిలోకి వెళ్లపోవడంతో తాజా అవసరాల నిమిత్తం మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనేది ఆ ఊహాగానాల వెనక ఉన్న నేపథ్యం. సుమారు పన్నెండు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తున్నది. ఒకసారి వలసలు ప్రారంభమైన తర్వాత ఈ సంఖ్య ఏ స్థాయికి వెళ్తుందనేది ఊహకు అందడం కష్టమే.

గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పుడు ‘సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు..’ అంటూ కేసీఆర్‌‌పై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఇప్పుడు అలాంటి విమర్శలను స్వయంగా ఎదుర్కోకుండా కాంగ్రెస్ ఎలాంటి ప్లాన్ వేస్తుందనేది కీలకంగా మారింది. కాంగ్రెస్‌లో చేరాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వారి పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు పెడుతుందా?.. మళ్లీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తీసుకుంటామని చెప్తుందా?.. మూడింట రెండొంతుల సంఖ్య (26 మంది)కు చేరుకునేవరకూ వెయిట్ చేసి ‘బీఆర్ఎస్ ఎల్పీ విలీనం’ అని సమర్ధించుకునే పరిస్థితులను సృష్టిస్తుందా?.. ఇలా అనేక చర్చలు జరుగుతున్నాయి.

‘ఇది సందర్భం కాదు’ అనే భావన

ప్రభుత్వ ఏర్పాటు హడావుడిలో ఉన్న కాంగ్రెస్ నాయకులెవరూ ఈ ఊహాగానాలను పట్టించుకోవడం లేదు. పార్టీ మారాలనుకుంటున్నవారు కూడా దీనిపై ఓపెన్‌గా చెప్పడానికి సిద్ధపడడంలేదు. ‘ఇది సందర్భం కాదు..’ అనేదే వారి వాదన. రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరితే ఉప ఎన్నికలో ఎంత మంది గెలుస్తారనేది మరో చర్చ. లోక్‌సభ ఎన్నికల నాటికి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎలాంటి డ్రామా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడంతా నివురు గప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.. ఈ ఊహాగానాల్లో నిజమెంతో తేలిపోతుంది.

Advertisement

Next Story