హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలను కాపాడిన SNDP.. హర్షం వ్యక్తం చేస్తోన్న బీఆర్ఎస్ నేతలు

by Anjali |   ( Updated:2024-09-02 15:23:02.0  )
హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలను కాపాడిన SNDP.. హర్షం వ్యక్తం చేస్తోన్న బీఆర్ఎస్ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి SNDP కాపాడిందంటూ బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ పాలనలో మాజీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ హయాంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఎన్డీపీ (వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం) సత్ఫలితాలనిస్తుందని అంటున్నారు. 2020లో హైదరాబాద్‌లో వరదలు వచ్చిన నేపథ్యంలో భారీ వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాలను సురక్షితంగా ఉంచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలాల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఏండ్లగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవని, ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేదని చెబుతున్నారు. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవని, ఈ దుస్థితికి కారణం వరద ప్రవాహ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమేనని, కానీ గత ఏడాది, ఈ ఏడాది హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసినా.. అలాంటి పరిస్థితి ఎక్కడా ఏర్పడలేదని, ఎస్‌ఎన్‌డీపీ చాలా ప్రాంతాల్లో వరద కష్టాలను శాశ్వతంగా తీర్చిందని తెలిపారు.

నగరవ్యాప్తంగా చేపట్టిన 36 నాలాల అభివృద్ధి పనుల్లో గత ఏడాదే 30కి పైగా పనులు పూర్తయ్యాయని అంటున్నారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి పథకం కింద కొత్త నాలాల నిర్మాణం, పాత నాలాల పునరుద్ధరణ పనులతో అనేక చోట్ల ముంపు బాధలు తప్పాయని, గత ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినా ఎస్‌ఎన్‌డీపీ పనులు చేపట్టిన దగ్గర లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలువలేదంటున్నారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కనిపించిందని, గత 2-3 రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా.. ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాలు నీట మునగలేదని, వరద నీరు నిలవలేదని, పునరుద్ధరించబడిన నాలాల వల్ల వాన ఆగిన కొద్దిసేపటికే కాలనీలు, రోడ్లు శుభ్రమయ్యాయని చెబుతున్నారు. ఇవన్నీ మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ అభివృద్ధి ఫలాలే అంటూ బీఆర్ఎస్ శ్రేణులు గర్వంగా చెబుతున్నారు.

Advertisement

Next Story