కంట్రోల్ తప్పుతున్న BRS నేతలు.. కాంట్రవర్సీ కామెంట్స్‌తో కొత్త చిక్కులు..

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-15 06:15:10.0  )
కంట్రోల్ తప్పుతున్న BRS నేతలు.. కాంట్రవర్సీ కామెంట్స్‌తో కొత్త చిక్కులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసనలు ఎదురవుతున్నాయి. సమస్యల పరిష్కారం, పథకాల లబ్ధిపై ప్రజలు నిలదీస్తున్నారు. ఇది వారి సహనానికి పరీక్షగా మారింది. దాన్ని జీర్ణించుకోలేక, సమాధానం చెప్పుకోలేక, అవమానాలను భరించలేక నేతలు కంట్రోల్ తప్పుతున్నారు. సిగ్గు, శరం ఉంటే.. అంటూ డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి (సిట్టింగ్ ఎమ్మెల్యే) రెడ్యానాయక్ నోరు జారారు. మక్తల్ ఎమ్మెల్యే (బీఆర్ఎస్ అభ్యర్థి) చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కూడా ‘ఇప్పుడు మీ వెనక తిరుగుతున్నా.. రేపటి రోజున మీరంతా నా వెనక తిరగాల్సి వస్తుంది..’ అంటూ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అచ్చంపేట ఎమ్మెల్యే (బీఆర్ఎస్ అభ్యర్థి) సైతం ఎన్నికల ప్రచారంలో నిలదీస్తున్న ప్రజలను కాంగ్రెస్ కార్యకర్తలా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరికొద్దిమంది అభ్యర్థులు సైతం ఇదే తీరులో నియంత్రణ కోల్పోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

అభ్యర్థుల్లో అయోమయం..

పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు నియంత్రణ కోల్పోయి పరుష పదజాలంతో కామెంట్లు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అనుకూలంగా ఓటు వేసిన ప్రజలే ఈసారి ఎదురుతిరగడం, ప్రశ్నించడం, నిలదీయడం, గ్రామం నుంచి తరిమేస్తుండడం లాంటివి చోటుచేసుకోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. నిన్నమొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీపైన విమర్శలకు మాత్రమే పరిమితమైన గులాబీ అభ్యర్థులు ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి ఎవరో తేలిపోవడంతో వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలే చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

చేజారుతున్న పరిస్థితులు..

పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంతో వాతావరణం అనుకూలంగా మారుతుందని తొలుత భావించి సభలను ఏర్పాటు చేసుకున్నారు ఆయా నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు. కేసీఆర్ సభ కావడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులంతా జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భేదాభిప్రాయాలను పక్కనపెట్టి సమిష్టిగా సహకారం అందించారు. కానీ ఇప్పుడు చాలా గ్రామాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో దాన్ని సర్దుబాటు చేయలేక అసహసనానికి గురవుతున్నారు. ఓటర్లను ముఖం మీదనే తిడుతుండడంతో పరిస్థితి మరింత చేజారిపోతున్నది. అభ్యర్థులకు, ఇన్‌చార్జిలకు మధ్య సఖ్యత లేక ఆశించినంతగా ప్రచారం జరగడంలేదన్న సమయంలోనే ఓటర్లపై అసహనాన్ని ప్రదర్శించడం మరింత చేటు చేస్తున్నదని పార్టీ ఆందోళన పడుతున్నది.

స్పీకర్‌కు ఎదురుగాలి..

సీనియర్ సభ్యులకు కూడా ప్రజల నుంచి ఛీత్కారాలు తప్పడంలేదు. కేసీఆర్ తరచూ లక్ష్మీ పుత్రుడు అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని అభివర్ణిస్తూ ఉంటారు. వీలైనంత ఎక్కువ సమయాన్ని నియోజకవర్గంలోనే గడుపుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆయనకూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిరసనలు తప్పడంలేదు. ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని భావించిన ఆయనకు ఈసారి పోటీచేయడం అనివార్యమైంది. రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రజల నుంచి వ్యతిరేకతను, నిరసనను చవిచూడని పోచారం ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన ఆయనకు ముఖంమీదనే ప్రజలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం అంతుపట్టలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేసిన తర్వాత ఈ పరిణామాలు జరగడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed