గులాబీ నేతల NTR రాగం.. గతానికి భిన్నంగా జయంతి వేడుకలు!

by GSrikanth |   ( Updated:2023-05-30 10:16:22.0  )
గులాబీ నేతల NTR రాగం.. గతానికి భిన్నంగా జయంతి వేడుకలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఎన్టీఆర్ రాగం అందుకుంది. గతానికి భిన్నంగా ఈసారి మంత్రుల దగ్గర నుంచి నేతల వరకు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. విగ్రహాలను సైతం ఆవిష్కరించారు. టీడీపీ కేడర్ మళ్లీ యాక్టివ్ అవుతుండడతో వారిని గులాబీ వైపు ఆకర్షితులను చేసే పనిలో నిమగ్నం కావడంతో పాటు ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఓట్ల కోసం రాజకీయం స్టార్ట్ చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోపాటు ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను చేపట్టింది. అంతేకాదు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టడంతో బీఆర్ఎస్‌లోని కేడర్, నాయకత్వం మళ్లీ ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న తరుణంలో టీడీపీ పుంజుకుంటుండడం.. గ్రామీణ ప్రజలకు ఎన్టీఆర్‌పై అభిమానం ఉండడం.. నాయకత్వం సైతం పటిష్టం అవుతుండడంతో బీఆర్ఎస్ కౌంటర్ స్ట్రాటజీ స్టార్ట్ చేసింది.

ఎన్నడూ లేనిది జయంతి వేడుకలు..

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ ఆదర్శనీయుడని, యుగ పురుషుడని, పేదల పెన్నిధి అని, రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారని, పేదలకు ఇండ్లు ఇచ్చారని, యువతకు ఆదర్శంగా నిలిచిన నేత అని పొగుడుతున్నారు. ఎన్టీఆర్‌ నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసీఆర్‌ అని, ఆయన ఆశయాలను పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌తో సహా సగానికిపైగా టీడీపీ నుంచి వచ్చిన వారే. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టీడీపీ నేతలు మాత్రమే ఎన్టీఆర్‌ జయంతి నిర్వహించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ నేతలు ఓట్ల రాజకీయానికి తెరలేపారు.

రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జయంతులను ఘనంగా నిర్వహించడం గమనార్హం. అంతేకాదు సొంత ఖర్చులతో కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసి ఆవిష్కరిస్తున్నారు. ఎన్టీఆర్‌ను సొంతం చేసుకొని ఆయన అభిమానుల మనసులను చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఖమ్మంలోని లకారం లేక్‌లో పువ్వాడ వర్గీయులు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, జయంతి ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌లోని ట్యాంకు బండ్ ఎన్టీఆర్ ఘాట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళి అర్పించారు. అనంతరం చిత్రపురి కాలనీ వద్ద, కూకట్‌పల్లిలోని మోతీ నగర్‌లో, కేపీహెచ్‌బీ కాలనీలోని వసంత నగర్ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు అరెకెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, ప్రకాశ్ గౌడ్, నల్లమోతు భాస్కర్ రావు, ఫిలింనగర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహించింది.

గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తారనే..

రాష్ట్రంలోని సుమారు 20 నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ నేటికీ గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు. అయితే గతంలో టీడీపీలో ఉన్న నేతలే బీఆర్ఎస్‌లో చేరడంతో వారికి బాసటగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి సారించడంతో ఆ ఓట్లు ఎక్కడ చీలిపోతాయోననే భయం బీఆర్ఎస్‌కు పట్టుకుంది. ఆ ఓట్లను కాపాడుకునేందుకు నేతలు ప్రయత్నాలు షురూ చేశారు. అందుకు ఎన్టీఆర్ జయంతిని వేదిక చేసుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ జయంతి రాజకీయాలకు కేంద్రంగా మారింది.


Advertisement

Next Story

Most Viewed