జీవో 46 రద్దు చేసేవరకూ రణమిస్తాం : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి

by M.Rajitha |
జీవో 46 రద్దు చేసేవరకూ రణమిస్తాం : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చినం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గు అనిపిస్తలేదా? ఈ విషయంలో దమ్ముంటే కేటీఆర్ సవాలును స్వీకరించాలని బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి డిమాండ్ చేసారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ... నిరుద్యోగ యువత అధైర్య పడొద్దని అండగా తమ పార్టీ అన్నిరకాలుగా ఉంటుందన్నారు. మీరు జీవో 46 రద్దు చేసేంత వరకు రణమెత్తుతూనే ఉంటామని హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించింది జాబ్ క్యాలెండర్ కాదని, జారుకునే క్యాలెండర్ అని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల నుండి తప్పించుకునే క్యాలెండర్ అని అభివర్ణించారు. ఇది ఉద్యోగాల క్యాలెండర్ కాదని ,ఉత్తుత్తి క్యాలెండర్ అన్నారు. జీవో 46 కేసును 26 సార్లు వాయిదా వేశారని, ఇంత తక్కువ కాల వ్యవధిలో ఇన్నిసార్లు వాయిదా పడ్డ కేసు ఇదేనన్నారు. తమ ఓట్లతో గెలిచి తమ డిమాండ్లపై ఎందుకు స్పందించరని తెలంగాణ ఎంపీలను నిలదీయాల్సిందిగా నిరుద్యోగ యువతకు ఆయన పిలుపునిచ్చారు. కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 46 బాధితుల ఉసురు పోసుకోవడానికే, కేసును నీరుగార్చడానికే అడ్వకేట్ జనరల్ ను వాదనలకు పంపించడం లేదని ఆరోపించారు. నిరుద్యోగులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని, చాలామంది బాధితులకు చేతులకు, మెడలకు, చెప్పుకోలేని చోట గాయాలు అయ్యాయన్నారు. ఇంతకంటే అణిచివేత ఇంకోటి ఉంటుందా.? అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రజా పాలన అనే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మంత్రి ఎందుకు పరామర్శించలేదని రాకేష్ రెడ్డి నిలదీశారు.

Next Story

Most Viewed