Women's T20 World Cup : ఈ సారి టైటిల్ గెలుస్తాం : హర్మన్‌ప్రీత్ కౌర్

by Harish |
Womens T20 World Cup : ఈ సారి టైటిల్ గెలుస్తాం : హర్మన్‌ప్రీత్ కౌర్
X

దిశ, స్పోర్ట్స్ : మరో 9 రోజుల్లో మహిళల టీ20 వరల్డ్ కప్‌‌‌కు తెరలేవనుంది. యూఏఈ వేదికగా వచ్చే నెల 3 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఈ మెగా ఈవెంట్‌కు సన్నద్ధమైన భారత మహిళల జట్టు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్ గెలవని టీమిండియా టైటిల్ నిరీక్షణకు తెరదించాలని చూస్తున్నది. ఈ సారి కచ్చితంగా టైటిల్ గెలుస్తామని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దీమా వ్యక్తం చేసింది.

యూఏఈకి బయల్దేరే ముందు మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరన్స్‌లో హర్మన్‌ప్రీత్.. పలు విషయాల గురించి మాట్లాడింది. ‘ఈ సారి టైటిల్ ఎత్తడానికి ఏం కావాలో అన్నీ మా దగ్గర ఉన్నాయి. 2020లో ఫైనల్‌కు చేరుకున్నాయి. గతేడాది తృటిలో ఫైనల్‌ను మిస్ అయ్యాం. అతిపెద్ద వేదికపై మేము ఏ విధంగా సత్తాచాటుతున్నామో చెప్పడానికి ఇదే నిదర్శనం. జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వాళ్లు ఏం చేయగలరో, వాళ్ల సామర్థ్యమేంటో నాకు తెలుసు. పేసర్లు పూజ వస్త్రాకర్, రేణుక సింగ్ ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్ అరుంధతి రెడ్డి జట్టు కోసం ఎల్లప్పుడూ బ్యాటింగ్, బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది.’ అని తెలిపింది.

అలాగే, తాను 19 ఏళ్ల వయసులో తొలి టీ20 ప్రపంచకప్ ఆడినప్పుడు ఏ విధంగా ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడూ అదే ఉత్సాహంతో ఉన్నానని తెలిపింది. అయితే, ఇప్పుడు అనుభవం కూడా తోడైందని, ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసునని చెప్పింది. ఫలితాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా ఆడటంపైనే దృష్టి పెట్టానని, స్వేచ్ఛగా ఆడుతూ క్రికెట్‌ను ఆస్వాదిస్తే తాను చాలా విషయాలను మార్చగలనని చెప్పుకొచ్చింది. యూఏఈ పరిస్థితుల గురించి మాట్లాడుతూ..‘చాలా వరకు మ్యాచ్‌లు రాత్రి జరగనున్నాయి. కాబట్టి, మంచు ప్రభావం ఉంటుంది. మాకు మంచి స్పిన్నర్లతోపాటు పూజ, రేణుక ఉన్నారు.’ అని తెలిపింది.

ఆస్ట్రేలియా‌తో సవాల్ గురించి మాట్లాడుతూ..‘మేము మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. భారత్ ఏం చేయగలదో వారికి తెలుసు. కచ్చితంగా వారిని ఓడిస్తాం.’ అని తెలిపింది. కాగా, టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ పోరు అక్టోబర్ 6న జరగనుంది. ఆ తర్వాత 9న శ్రీలంకతో, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Next Story

Most Viewed