అసంతృప్త నేతలపై BRS అధిష్టానం ఫోకస్.. చెక్ పెట్టేలా ప్లాన్!

by GSrikanth |   ( Updated:2023-03-25 02:22:21.0  )
అసంతృప్త నేతలపై BRS అధిష్టానం ఫోకస్.. చెక్ పెట్టేలా ప్లాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎలక్షన్ టైమ్ దగ్గర పడుతుండడంతో అసంతృప్త నేతలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలపై పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందుకే అసంతృప్త నేతలకు చెక్ పెట్టాలని భావిస్తున్నది. అందులో భాగంగా ముందుగా వారికి గన్ మెన్ల భద్రతను కుదిస్తున్నది.

చాలా మంది భద్రత కుదింపు

ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైతం గన్ మెన్లను ఉపసంహరించుకున్నది. కరోనా సమయంలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కేటాయించిన ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించింది. తాజాగా మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్యకు కేటాయించిన 2+2భద్రతను 1+1కు కుదించింది. దీంతో ఆయన ఆ భద్రత కూడా వద్దని వెనక్కి పంపారు. మరో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కు ఉన్న 1+1 భద్రతను రద్దు చేసింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయి, ప్రస్తుతం భద్రాచలం పార్టీ ఇన్ చార్జిగా ఉన్న తెల్లం వెంకట్రావ్ కు ఉన్న భద్రతను సైతం రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. వీరితో పాటు గతంలోనే చాలా మందికి భద్రతను ఉపసంహరించుకున్నాదు. ఇంకా మరికొంత మందికి భద్రతను తొలగించేందుకు లిస్ట్ తయారైనట్లు తెలిసింది.

అసంతృప్తులకు చెక్ పెట్టేందుకే!

చాలా నియోకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలపై అధినేత కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. అయితే రోజురోజుకు గ్రూపు రాజకీయాలు ఎక్కువ అవుతుండటంతో వాటికి చెక్ పెట్టేందుకే భద్రత కుదింపు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సాఫ్ట్ కారణాలు చూపి గన్ మెన్లను వెనక్కి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఇలాంటి చర్యలతో అసంతృప్తులకు చెక్ పడుతుందా అనేది పార్టీలోనే చర్చనీయాంశమైంది. భద్రత ఉపసంహరించుకున్నంత మాత్రానా లాభం ఉండదని, వారిపై వేటు వేస్తేనే అసమ్మతికి చెక్ పడుతుందని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భద్రత కుదిస్తున్నారని మాజీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

కొందరు నేతల ప్రోద్బలంతోనే: కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే

పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. అయినప్పటికీ కొంతమంది నేతల ప్రోద్బలంతోనే ప్రభుత్వం భద్రతను కుదించింది. నా భద్రతను 1+1కు కుదించడంతో, అది కూడా వద్దని తిప్పి పంపాను. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉంటాను.

కక్షగట్టి తొలగించారు: పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది నేతలు కక్షగట్టి నా భద్రతను తొలగింపజేశారు. గన్ మెన్లు లేకపోయినా ప్రజాక్షేత్రంలో ఉంటాను. మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో తిరుగుతున్నానని, అధిష్టానానికి ఫిర్యాదు చేసి మరీ గన్ మెన్లను వెనక్కి తీసుకునేలా చేశారు. వారి కుట్రలను త్వరలోనే తిప్పికొడతా.

Also Read..

రాహుల్ ఇష్యూపై బీఆర్ఎస్ సమిష్టి పోరు.. జాతీయ లీడర్లకు కేసీఆర్ ఫోన్లు..!

Advertisement

Next Story