New Revenue Act: అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ డుమ్మా.. కనీసం ఆ పనైనా చేయాలని కోదండరెడ్డి రిక్వెస్ట్

by Prasad Jukanti |
New Revenue Act: అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ డుమ్మా.. కనీసం ఆ పనైనా చేయాలని కోదండరెడ్డి రిక్వెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధరణి పోర్టల్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కొత్త రెవెన్యూ చట్టంపై ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ కు సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీలతో సహా ధరణి సమస్యలపై పోరాటం చేసిన నేతలు, మేధావులు హాజరయ్యారు. కొత్త చట్టంలో ఉండాల్సిన అంశాలపై నేతలు, మేధావుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ అఖిల పక్ష సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం దూరంగా ఉన్నాయి.

కనీసం రాతపూర్వకంగా నైనా చెప్పండి..

ధరణి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతున్నదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ధరణి సమస్యల కారణంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తాము అధికారంలోకి వచ్చాక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 2 లక్షల అప్లికేషన్లను పరిష్కరించగలిగామన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాలేదని విమర్శించారు. మీటింగ్ కు రాకపోయినా పర్వాలేదు కానీ మీ పార్టీ సలహాలు సూచనలు రెవెన్యూ శాఖ సెక్రటరీకి కనీసం రాతపూర్వకంగానైనా పంపించి సహకరించాలని కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడే అంశం అని అందువల్ల అందరూ సహకరించాలని కోరారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దనే ప్రయత్నం అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed