BREAKING : సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసీఆర్

by Rajesh |   ( Updated:2024-07-14 16:40:01.0  )
BREAKING : సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ళతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినా రిలీఫ్ లభించలేదు. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేసీఆర్ తరఫున న్యాయవాది మోహిత్‌రావు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నది. జ్యుడిషియల్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిబంధనల ఉల్లంఘన అని, దానికి హెడ్‌గా ఉన్న జస్టిస్ నర్సింహారెడ్డి ఎంక్వయిరీకి ముందే మీడియాకు కొన్ని వివరాలను వెల్లడించారని, ఆయన స్వచ్ఛందంగా ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో కేసీఆర్ పేర్కొన్నారు.

కానీ హైకోర్టు మాత్రం... కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, పిటిషన్‌లో లేవనెత్తిన ఆరోపణలకు తగిన ఆధారాలను వాదనల సందర్భంగా రుజువు చేయలేకపోయారని, కోర్టుకు కూడా వాటిని సమర్పించలేకపోయారని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నెల 1న తీర్పు ఇచ్చింది. కమిషన్ ఏర్పాటులో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని, విచారణకు హాజరు కావాల్సిందిగా జస్టిస్ నర్సింహారెడ్డి ఇచ్చిన నోటీసుల్లోనూ ఎలక్ట్రిసిటీ చట్టంలోని సెక్షన్ 8-బి, సి ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు లేవని తీర్పులో బెంచ్ పేర్కొన్నది. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్పోజ్ చేయడంతో కమిషన్ నుంచి మరోసారి నోటీసు వస్తుందనే ఊహాగానాలు వచ్చాయి. దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాదిగా ఎవరు హాజరవుతారు?... తెలంగాణ హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను ఎలా కౌంటర్ చేస్తారు?... సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై మొదటి రోజునే వాదనలను వింటుందా?... లేక లోతుగా విచారణ చేపట్టాలనే పేరుతో కొన్ని రోజులు వాయిదా వేస్తుందా?... లేక అప్పటి వరకూ ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దంటూ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌ను ఆదేశిస్తుందా?... ఇలాంటి అనేక రూపాల్లో ఉత్కంఠ నెలకొన్నది. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ గడువు ప్రభుత్వం తొలుత జూన్ 30వ తేదీ వరకు మాత్రమే ఇచ్చినా ఎంక్వయిరీ పూర్తికానందున కొంతకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. కానీ దీనికి సంబంధించిన రాతపూర్వక ఆదేశాలు వెలుగులోకి రాకపోవడంతో ఒక్క నెల పాటు పొడిగించిందా?.. లేక రెండు నెలల గడువు ఇచ్చిందా?.. అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది. సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు వెలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టులో కేసీఆర్‌కు రిలీఫ్ లభించనందున సుప్రీంకోర్టులోనైనా ఊరట వస్తుందా?... లేక భిన్నమైన ఆదేశాలు వెలువడతాయా అనేది తేలాల్సి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed