Breaking : సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన రద్దు..!

by Maddikunta Saikiran |
Breaking : సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన రద్దు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణాలో పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో చాలా కంపెనీల ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా.. ఈ పర్యటనలో సీఎం రేవంత్ ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత హైదరాబాద్ లో తమ నూతన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కాగ్నిజెంట్ అంగీకారం తెలిపింది. అలాగే కర్రా హోల్డింగ్స్ , ట్రైజిన్ టెక్నాలజీస్ లాంటి తదితర కంపెనీలు కూడా తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.

అయితే.. అమెరికా పర్యటన తరువాత సీఎం రేవంత్ నేరుగా దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళాల్సింది. కానీ కాంగ్రెస్ నాయకుల నుంచి అందిన సమాచారం మేరకు సీఎం దక్షిణ కొరియా పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం దక్షిణ కొరియా పర్యటన రద్దుపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ నెల 15న కాంగ్రెస్ హైకమాండ్ టీపీసీసీ అధ్యక్షున్ని ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ పదవి కోసం కొంత మంది ముఖ్య నేతలు పోటీపడుతున్నారు .ముఖ్యంగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈ పదవి కోసం ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు లంబాడా వర్గాలవారికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఈ సారి తనకు అవకాశం కల్పించాలని బలరాం నాయక్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కోరుతున్నారు. అలాగే గౌడ సామజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, తాను 35 ఏళ్ళుగా పార్టీ కోసం కష్టపడుతున్నాని తనకే పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో వీరి ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో.. టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం కొందరు నేతలు ఢిల్లీలో పావులు కదుపుతున్నారు. దీంతో టీపీసీసీలో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో సీఎం రేవంత్ సౌత్ కొరియా పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.ఈ నెల 12న సీఎం రేవంత్ రెడ్డి యూఎస్ నుంచి నేరుగా ఢిల్లీ రాబోతున్నట్టు సమాచారం. ఢిల్లీకి చేరుకున్న తరువాత రాహుల్ గాంధీతో భేటీ అవుతారని, ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షున్ని ఎన్నుకుంటారని తెలుస్తోంది. సీఎం వస్తూనే కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో భేటీ కాబోతుండటంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story

Most Viewed