సీతారాం ఆలోచనలతో బీజేపీని నిలువరించాలి.. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |
సీతారాం ఆలోచనలతో బీజేపీని నిలువరించాలి.. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్‌గాంధీపై కేంద్ర మంత్రివర్గంలో ఉన్న రవ్‌నీత్ సింగ్ బిట్టూ పరుష పదజాలంతో దూషిస్తే ప్రధాని మోడీ స్పందించకపోవడం, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపీ ఫాసిస్టు విధానాలకు, స్వభావానికి నిరదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక వీధి రౌడీలా కేంద్ర మంత్రి బిట్టూ వ్యాఖ్యలు చేస్తే దానిపై ప్రధాని మౌనంగా ఉండడం, మంత్రివర్గం నుంచి తొలగించేలా చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. ప్రధాని మోడీ మౌనం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదన్నారు. తప్పుడు విధానాలు, పరుష పదాలతో కూడిన భాషను వాడుతున్నప్పుడు ఒక జడ్జీలా వ్యవహరించే సీతారాం ఏచూరి ఇప్పుడు మన మధ్య లేకపోవడం తీరని నష్టమన్నారు. భాషలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని కాపాడుకోవాలనుకుంటున్న బీజేపీ విధానాలను సీతారాం ఏచూరి ఆలోచనలతో నిలువరించాల్సిన అవసరం అందరిపైనా ఉన్నదన్నారు. అనారోగ్యంతో ఇటీవల మరణించిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణకు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా రవీంద్రభారతిలో శనివారం సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు.

జమిలి ముసుగులో బీజేపీ అధికార దాహం :

జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలనుకుంటున్న కీలకమైన, చారిత్రాత్మక సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని నష్టమని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్... బీజేపీ ఆలోచనా విధానంపై నిప్పులు చెరిగారు. బీజేపీతో పాటు అలాంటి ఆలోచన కలిగిన పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తున్నాయని, అధికారాన్ని నిలబెట్టుకోడానికి తీసుకొస్తున్న రాజ్యాంగ సవరణలు దేశ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతున్నాయన్నారు. జమిలి పేరుతో రాజ్యాంగ సవరణలు చేయడం పరిపాలనాపరమైన అంశానికి సంబంధించిన విషయం కాదన్నారు. రాష్ట్రాల కలయికే దేశం అని రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించినా సహకార సమాఖ్య (ఫెడరల్ స్పిరిట్) స్ఫూర్తిని తుంగలో తొక్కి జమిలి ఎన్నికల ముసుగులో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకోవాలని బీజేపీ భావిస్తున్నదన్నారు. దీన్ని ఇప్పటికే చాలా పార్టీలు వ్యతిరేకించాయని, ఇలాంటి సమయంలో సీతారాం ఏచూరి లేని లోటు కేవలం సీపీఎంకు మాత్రమే కాక దేశానికే తీరని లోటు అని అన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాల్సిన సమయంలో ఆయన లేకపోవడం పేదలకు నష్టమన్నారు.

జాతీయ రాజకీయాలకు దిక్సూచిగా... :

దేశ రాజకీయాల్లో ఒక దిక్సూచిలాగా వ్యవహరించిన సీతారాం ఏచూరి ముద్రలు యునైటెడ్ ఫ్రంట్ నుంచి తాజాగా ‘ఇండియా’ టీమ్ వరకు ఉన్నాయని గుర్తుచేసిన సీఎం రేవంత్‌... సమయస్ఫూర్తితో వ్యవహరించారన్నారు. కేరళలో కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం పాలిటిక్స్ ఉన్నా జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్‌తోనే జతకట్టేలా విధాన నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. బీజేపీని నిలువరించడానికి దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన సీతారాం ఏచూరి ఇప్పుడు జమిలి ఎన్నికల్లాంటి విధాన నిర్ణయాల సమయంలో మన మధ్య లేకపోవడం నేషనల్ పాలిటిక్స్ కే లోటు అని అన్నారు. సిద్ధాంతం కోసం పరితపించిన సీతారాం ఏచూరి విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ మొదలు తాజాగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు ఒకే పార్టీలో కొసాగారని, ఆలోచన మాత్రమే కాక ఆచరణ ద్వారానూ చివరి శ్వాస వరకూ జీవించారని అన్నారు. ఒకే సిద్ధాంతంతో ఉండే అరుదైన నేతలలు కొద్దిమందే ఉంటారని, సీతారాం ఏచూరి లాంటివారిని భూతద్దం పెట్టి వెదికినా కనిపించడం కష్టమేనని అన్నారు. బతికున్నంతకాలం నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన కొద్దిమందిలో ఏచూరి ఒకరని గుర్తుచేశారు.

జైపాల్‌రెడ్డికి సమకాలికుడిగా ఏచూరి :

పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తాను కొన్నిసార్లు సీతారాం ఏచూరిని కలిశానని, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సీనియర్ రాజకీయ నాయకుడు జైపాల్‌రెడ్డితో మాట్లాడినట్లుగానే ఉన్నదని గుర్తుచేసుకున్నారు. సిద్ధాంతపరంగా, ఆలోచనా విధానంలో ఆయనకు సమకాలికులనే భావన కలిగిందన్నారు. యూపీఏ 1, 2 హయాంలో పేద ప్రజల గొంతుకగా వ్యవహరించిన సీతారాం ఏచూరి రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత తదితర పలు కీలక స్కీమ్‌లకు అంకురార్పణ చేయడంలో కీలక భూమిక పోషించారని గుర్తుచేశారు. గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న సీతారాం ఏచూరిని రాహుల్‌గాంధీ ఒక ఫిలాసఫర్‌గా, గైడ్‌గా, ఫ్రెండ్‌గా, సిద్ధాంతకర్తగా భావించారని పేర్కొన్నారు. సీతారాం ఏచూరి చనిపోయే సమయానికి రాహుల్‌గాంధీ అమెరికాలో ఉన్నారని, ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారని సీఎం రేవంత్ గుర్తుచేశారు. సీతారాం ఏచూరి భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆలోచన, బీజేపీకి వ్యతిరేకంగా చేసిన పోరాటం, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి పడిన తపనను నిత్యం స్మరించుకోవాలని కోరారు.


Next Story

Most Viewed