ఆ జీవో నిబంధనలు మార్చండి.. యూఎస్‌పీసీ డిమాండ్

by srinivas |
ఆ జీవో నిబంధనలు మార్చండి.. యూఎస్‌పీసీ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ప్రశ్నించారు. డీఎస్సీ ద్వారా ఖాళీలను భర్తీ చేయాల్సింది పోయి సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వడమేంటని నిలదీశారు. తరగతికో ఉపాధ్యాయుడిని నియమించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించాల్సింది పోయి, అశాస్త్రీయమైన జీవో 25ను అమలు చేయాలని పాఠశాల విద్యా సంచాలకులు.. కలెక్టర్లను ఆదేశించడాన్ని తప్పుబట్టారు. పాఠశాలల్లో 11 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని, అదే 60 మంది విద్యార్థులకు కూడా ఇద్దరిని కేటాయించాలనడం అసంబద్ధమైనదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుల బదిలీల్లో పాఠశాల విద్యాశాఖ పాటించిన నిబంధనలను కూడా అమలు చేయలేదని యూఎస్‌పీసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి ప్రాథమిక పాఠశాల్లో 40 మంది విద్యార్థులకు ఇద్దరు, 60 మందికి ముగ్గురు, ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయించాలని యూఎస్‌పీసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాయుడిని నియమించి ఉపాధ్యాయులను భోదనేతర పనుల నుంచి మినహాయించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో ప్రతి 25 మంది విద్యార్థులను ఒక సెక్షన్‌గా పరిగణించి ప్రభుత్వ ఉత్తర్వులు 25ను సవరించాలన్నారు. రేషనలైజేషన్‌ జీవో 25 నిబంధనలను మార్చాలని, అశాస్త్రీయమైన సర్దుబాటు ప్రక్రియను నిలిపివేయాలని యూఎస్‌పీసీ నాయకులు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed