నర్సింగ్ అడ్మిషన్లలో హెల్త్​యూనివర్సిటీ అత్యుత్సాహం.. ఈసారైనా న్యాయం జరిగేనా?

by GSrikanth |   ( Updated:2022-11-30 14:09:32.0  )
నర్సింగ్ అడ్మిషన్లలో హెల్త్​యూనివర్సిటీ అత్యుత్సాహం.. ఈసారైనా న్యాయం జరిగేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరేందుకు అబ్బాయిలకు అవకాశం ఇవ్వడం లేదు. నర్సింగ్​కాలేజీల్లో కేవలం అమ్మాయిలకు మాత్రమే అడ్మిషన్లు ఇస్తున్నారు. దీంతో నర్సింగ్ వృత్తిపై ఆసక్తి పెట్టుకున్న విద్యార్థులు అసంతృప్తి చెందుతున్నారు. అడ్మిషన్లు ఇవ్వకుండా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆఫీసర్లు అత్యుత్సాహం చూపిస్తున్నారు. సర్కార్ జీవో స్పష్టంగా ఉన్నా, ఇటీవల నిర్వహించిన కౌన్సిలింగ్​లలో సీట్లు కేటాయించకపోవడం గమనార్హం. దీంతో డిసెంబరులో నిర్వహించే మరో విడత కౌన్సిలింగ్​లోనైనా సీట్లను కేటాయించాలని నర్సింగ్​అసోసియేషన్లు కోరుతున్నాయి. ప్రతీ కాలేజీలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని యూనియన్ల నుంచి డిమాండ్​పెరిగింది. అంతేగాక జిల్లాకో కొత్త నర్సింగ్​కాలేజీల్లోనూ మేల్స్‌కు సీట్లు కేటాయించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. నర్సింగ్ కోర్సులు చేసేందుకు వందలాది మంది అబ్బాయిలు ఆసక్తి చూపినా, చదివేందుకు సర్కార్ అవకాశాన్ని కల్పించలేకపోతున్నది. దీంతో ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ బీసీ విద్యార్థులకు నష్టం జరుగుతున్నది.

2005లో జీవో..

ఉమ్మడి రాష్ట్రంలో 2005 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ప్రతీ నర్సింగ్​కాలేజీలో మేల్స్ కూడా బీఎస్సీ నర్సింగ్ కోర్సులు చేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ సర్క్యూలర్​ఇచ్చింది. ప్రతీ బ్యాచ్‌కు కనీసం ముగ్గురు చొప్పున అవకాశం ఇవ్వాలంటూ సూచించింది. ఆ తర్వాత ఆ రూల్​ప్రకారమే నర్సింగ్​ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగాయి. కానీ 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిబంధనను తుంగలో తొక్కినది. కేవలం స్కూల్ ఆఫ్​నర్సింగ్​అడ్మిషన్లలో ఈ రూల్‌ను పాటిస్తున్నారు. కాలేజీ ఆఫ్ నర్సింగ్ కోర్సుల్లో (బీఎస్సీ) మేల్స్‌ను చేర్చుకోవట్లేదు. ఆఫీసర్లు కూడా నర్సింగ్ కోర్సులు చదివేందుకు మేల్స్‌కు అవకాశం ఇవ్వట్లేదు. 2014 నుంచి ప్రభుత్వ నర్సింగ్​ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులు చదివేందుకు కనీసం ఒక్కరికి కూడా అడ్మిషన్ ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో ఎంతోమంది పేద విద్యార్థులు ఉపాధికి దూరమయ్యారు.

హాస్టల్ లేదనే సాకుతో..

హాస్టల్ సౌకర్యం లేనందునే బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు సీట్లు ఇవ్వలేకపోతున్నట్లు పలు కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆ సౌకర్యాన్ని కల్పించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా, రెస్పాన్స్ రావట్లేదని ఓ ప్రిన్సిపాల్​చెప్పారు. ఉస్మానియా, గాంధీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ప్రైవేట్ హాస్టళ్లలో ఉండి కోర్సులు పూర్తి చేస్తామని విద్యార్థులు ముందుకు వచ్చినా సీట్లు ఇచ్చేందుకు కాలేజీలు నిరాకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రైవేట్ కాలేజీల్లో పైసలు పెట్టి చదవలేని విద్యార్థులు దీన స్థితిలోకి వెళ్లిపోతున్నారు.

అన్ని కాలేజీల్లో ఇవ్వాల్సిందే: నీరడి సూర్యం, ఓయూ రీసెర్చ్​ స్కాలర్

ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో బీఎస్సీ కోర్సులో చేరేందుకు అబ్బాయిలకు అవకాశం ఇవ్వాలి. ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కొవిడ్​విపత్కర పరిస్థితుల్లో ఎంతోమంది మేల్ నర్సులు ప్రజలకు వైద్యసేవలు అందించారు. నర్సింగ్​ వృత్తిపై ఆసక్తి ఉన్నోళ్లకు రూల్​ ప్రకారం సీట్లు కేటాయించాలి. కాళోజీ వర్సిటీ నిర్లక్ష్యం పెరిగిపోయినది. ప్రభుత్వం సూచించిన జీవో ప్రకారం అడ్మిషన్లు ఇవ్వలేని పరిస్థితిలో అక్కడి అధికారులు ఉండటం విచిత్రకరమని నీరడి సూర్యం అన్నారు.

READ MORE

కరెంట్ అఫైర్స్: 30-11-22

Advertisement

Next Story