రాష్ట్రాలను అలా మార్చాలనేదే బీజేపీ స్కెచ్.. బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Rajesh |
రాష్ట్రాలను అలా మార్చాలనేదే బీజేపీ స్కెచ్.. బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్వతంత్ర భారత్‌లో ప్రవేశ పరీక్షల్లో జరిగిన అతి పెద్ద అవకతవకలు నీట్ యూజీలోనే జరిగాయని, ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే నీట్ ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్ష రద్దు చేయడం వల్ల ఎంతో మంది నష్ట పోయారన్నారు. నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినప్పుడే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేస్తే బాగుండేదన్నారు.

గొర్రెల కొనుగోలు కుంభకోణం లో ఈడీ విచారణ జరపాలని బీజేపీ ఎంపీ రఘునందన్ కోరారని, మరి నీట్ లీకేజీపై ఈడీ దర్యాప్తు అక్కర్లేదా..? అని ప్రశ్నించారు. చిన్న కేసులకు ఈడీని పంపే మోడీ నీట్ అవకతవకలపై ఎందుకు రంగంలోకి దింపలేదని నిలదీశారు. సుపరిపాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ గతంలో పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ జరిగిందని ఆరోపించడంతో పాటు ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారని, నీట్ 24 లక్షల మంది రాశారని వారందరికీ లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని బండి ఎందుకు డిమాండ్ చేయరన్నారు. సీఎం రేవంత్ న్యాయవాదిని సుప్రీం కోర్టులో నియమించి రాష్ట్రం తరపున వాదనలు వినిపించాలన్నారు. రాష్టం లో ఎంసెట్ 60 ఏండ్లుగా బాగా జరిగిందని అదే పద్ధతి మళ్ళీ రావాలన్నారు. ఇప్పటి దాకా నీట్ ఎన్ని సార్లు లీక్ అయ్యిందో అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. తెలంగాణ విద్యార్థులు నీట్ తో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రాలను మునిసిపాలిటీలుగా మార్చాలనేదే బీజేపీ ఎత్తుగడ అని, అన్ని పరీక్షలనూ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవడం ఫెడరలిజంను మంట గలపడమేనని మండిపడ్డారు. పదో తరగతికి ఇంటర్ మీడియట్ కు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సిలబస్ ఉందని, జాతీయ స్థాయిలో ఒకే పరీక్షతో అందరికీ ఎలా న్యాయం జరుగుతుంది? అని ప్రశ్నించారు. పార్లమెంటు కొలువు తీరిందని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్ రెడ్డి, నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి , సి.కళ్యాణ్, పావని గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed