Shilpa Reddy: కేటీఆర్ సంస్కార హీనుడు.. డబ్బుందనే అహంకారం ఎక్కువ

by Gantepaka Srikanth |
Shilpa Reddy: కేటీఆర్ సంస్కార హీనుడు.. డబ్బుందనే అహంకారం ఎక్కువ
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ ప్రజలకు తక్షణమే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఆయన్ను బయట తిరగనివ్వబోమని శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. బీజేపీ మహిళా మోర్చా పక్షాన తగిన బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేటీఆర్‌పై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలున్నాయని ఫైరయ్యారు. మహిళలంటే కేటీఆర్‌కు ఏ మాత్రం గౌరవం లేదని, ఆయనో సంస్కారహీనుడని ధ్వజమెత్తారు.

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సమంజసమా? కాదా? అని ఆయన కుటుంబ సభ్యులను అడిగితే కూడా తెలుస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారంతా పేద, మధ్యతరగతి మహిళలేనని, డబ్బుందనే అహంకారంతో కేటీఆర్ పేద, మధ్య తరగతి మహిళలను అవమానిస్తున్నారని ఆమె విరుచుకుపడ్డారు. మహిళల విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ఇప్పుడో రకంగా మాట్లాడటం కేటీఆర్‌కు అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి సైతం కేటీఆర్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. కేటీఆర్ హద్దుల్లో ఉండి మాట్లాడాలని, లేదంటే ఆయన్ను చీపుర్లతో సన్మానించేందుకు కూడా వెనుకాడబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed