మునుగోడులో బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా నేతల కదలికలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-13 05:26:51.0  )
మునుగోడులో బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా నేతల కదలికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికల్లో కాషాయదళం సీక్రెట్ గా తమ ప్లాన్ ను అమలు చేస్తోంది. తాము ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహ రచన చేస్తున్నామనేది ప్రత్యర్థి పార్టీల నేతలకు తెలిస్తే తమకు ఇబ్బంది అనే ఉద్దేశంతో సైలెంట్ గా పని చేసుకుంటూ వెళ్తోంది. ఎవరిని కలిసేది కూడా తెలియకుండా మొత్తం సీక్రెట్ గా మెయింటెన్ చేస్తోంది. ఉప ఎన్నికల్లో తాము ఎలాంటి వ్యూహ రచన చేస్తున్నామని కాంగ్రెస్, టీఆర్ఎస్ కు తెలియకుండా చేయాలని ఉద్దేశ్యపూర్వకంగానే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వానికి వచ్చిన ఆదేశాల మేరకే రాష్ట్ర నేతలు ఎవరి పని వారు సైలెంట్ గా చేసుకుంటూ ముందుకు పోతున్నారని చెబుతున్నారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే ఇక్కడి నేతలు మలుచుకుంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతో చాప కింద నీరులా దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి పార్టీలకు ఇరుకున పెట్టే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.

మునుగోడులో ఇప్పటికే అమిత్ షా టీం సర్వే చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన నివేదికలు కూడా అధిష్టానం వద్దకు చేరినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే ఢిల్లీ పెద్దలు స్థానిక నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు టాక్. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. అయినా ముందు నుంచే బీజేపీ తమ గ్రౌండ్ ను సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మునుగోడులో అభివృద్ధి పనులకు, పలు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత? కేంద్రం పెట్టిన ఖర్చెంత అనే లెక్కల కోసం ఆర్టీఐ అస్త్రాన్ని ఎక్కుపెట్టింది. ఇప్పటికే బీజేపీ సంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా వచ్చాయి. అయితే బైపోల్ నోటిఫికేషన్ వచ్చాక ప్రచారం సమయంలో ఆ సమాధానాలను వాడుకోవాలని యోచిస్తోంది. కేంద్రం ఖర్చు పెట్టింది ఎంత? రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందెంత? అనే అంశాలపై ప్రజలకు వివరించాలని భావిస్తోంది.

ఉప ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలను, వాటి అమలు విషయంలో గోప్యత పాటించాలని హైకమాండ్ నుంచి వచ్చిన తాజా ఆదేశాలను రాష్ట్ర నేతలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. నేతలు ప్రజలను ఎప్పుడు కలుస్తున్నారనే విషయం కూడా బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాలకు చెక్ పెట్టాలంటే ఈ సీక్రెట్ గానే ముందుకు వెళ్లాలని అధిష్టానం భావిస్తోంది. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేసినప్పటి నుంచి ముందస్తుగా తీసుకున్న సమాచారం మేరకే ఢిల్లీ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బైపోల్ కోసం రచించనున్న వ్యూహం, ఎత్తుగడలు, క్షేత్రస్థాయిలో ఓటర్లను కలిసే నెట్ వర్క్ ప్రత్యర్థి పార్టీలకు తెలియకుండా పకడ్బందీగా సాగుతన్నట్లు తెలస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా బీజేపీ నేతలు ప్రజలను కలుస్తున్నట్లు వినికిడి. గ్రామాల్లో ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో, ఏం మాట్లాడుతున్నారు, ఓటర్లను వాళ్లవైపు ఎలా తిప్పుకుంటున్నారు, అందుకు ఎలాంటి హామీలిస్తున్నారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. గ్రామాల్లో పలు అంశాలపై ఆరా తీసేందుకు ఒక్కో ఊరికి ఎంత మందికి బాధ్యతలు అప్పగించారనేది కూడా తెలియడం లేదు. ఈ ఆపరేషన్ ను స్థానికంగా ఉండి ఎవరు లీడ్ చేస్తున్నారు. వారు స్థానికంగా ఎక్కడ నివసిస్తున్నారు అనే విషయాలు ఎవరికీ తెలియకుండా బీజేపీ పక్కాగా ప్రణాళిక చేస్తోంది.

ఢిల్లీ పెద్దల సీక్రెట్ మిషన్ కు సునీల్ బన్సల్ అయితేనే కరెక్ట్ అని భావించిన జాతీయ నాయకత్వం.. తెలంగాణ ఇన్ చార్జీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది. బన్సల్ కు షాడో ఆఫ్ అమిత్ షాగా పేరుంది. బ్యాక్ బోన్ గా కూడా చెప్పుకుంటారు. మునుగోడులో ఢిల్లీ పెద్దల ప్లాన్ అమలు బాధ్యత అంతా బన్సల్ డైరెక్షన్ లోనో సాగుతోంది. ఇందుకోసమే జాతీయ నాయకత్వం ఆయనను ఏరికోరి మరీ ఇక్కడికి పంపినట్లు టాక్. ప్రత్యర్థి పార్టీల ఊహకు కూడా అందని రీతిలో ప్లాన్ చేయడంలో బన్సల్ దిట్ట. యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన రికార్డు ఎవరికీ లేదు. కానీ వాటిని బుట్టదాఖలు చేస్తూ బన్సల్ రెండోసారి బీజేపీని అధికారింలోకి తీసుకొచ్చి రికార్డును బ్రేక్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న నాలుగో విడుత పాదయాత్రకు ముఖ్య అతిథిగా ఉన్న బన్సల్ కాసేపు ఉండి మధ్యలోనే తిరిగి వచ్చారు. మునుగోడుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకే ఆయన వెంటనే రిటర్న్ కావల్సి వచ్చిందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అది కూడా మునుగోడుపై సీక్రెట్ మిషన్ కోసమేనని సమాచారం. అయితే బీజేపీ చేపడుతున్న సీక్రెట్ మిషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఉప ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.

Also Read : ఊర్లలో చిచ్చు రేపుతోన్న ఆ ఖర్చు.. మునుగోడులో సర్పంచ్‌లకు కొత్త టెన్షన్!

Also Read : పక్షపాత పాలనలో టీఆర్ఎస్! సాక్ష్యాలివే అంటోన్న బండి సంజయ్

Also Read : అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్ సస్పెండ్


Advertisement

Next Story