BJP: కమలానికి ‘పంచాయతీ’ పరీక్ష..! పార్టీలో ఎవరిదారి వారిదే?

by Shiva |
BJP: కమలానికి ‘పంచాయతీ’ పరీక్ష..! పార్టీలో ఎవరిదారి వారిదే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి సవాలుగా మారనున్నాయి. పార్టీ బలోపేతానికి ఈ ఎలక్షన్లే అగ్ని పరీక్షగా నిలవనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అరకొరగా ఎనిమిది సీట్లు గెలుచుకున్న కాషాయ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ఈ స్థానాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతమైందని భావిస్తే అది మొదటికే ఎసరు వచ్చే ప్రమాదముందని శ్రేణులు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ చరిష్మా, హిందుత్వ వాదం, ఇతర అంశాలు గెలుపునకు దోహదపడ్డాయని బహిరంగంగానే చర్చ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎలక్షన్స్‌కు మధ్య వ్యత్యాసం ఆధారంగా ఇది చెప్పొచ్చని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ ఉన్నది. అయితే బీజేపీ అసలు బలం, బలగం ఎంత? అన్నది లోకల్‌బాడీ ఎన్నికల్లో తేలనున్నది.

మేజర్ యాక్టివిటీస్ కరువు

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఎలాంటి మేజర్ యాక్టివిటీస్ చేపట్టలేదు. రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి పెంచేలా ప్రోగ్రామ్స్ నిర్వహించిన దాఖలాలు తక్కువే. నిరుద్యోగుల అంశంపై బీజేవైఎం, మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మహిళా మోర్చా మినహా ఇతర మోర్చాలు ఎందులోనూ ఇన్వాల్వ్ కాలేదు. రైతు సమస్యలపై అడపాదడపా కార్యక్రమాలు నిర్వహించినా అవి అనుకున్న మేరకు సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, హైడ్రా, మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ వంటి అంశాలపై ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించకుండా కమల దళం చేతులెత్తేసింది.

స్టేట్ చీఫ్ ఉన్నా.. లేనట్లుగానే..

పార్టీ స్టేట్ చీఫ్‌గా కిషన్‌రెడ్డి ఉన్నా లేనట్లుగానే మారింది. అటు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా కిషన్‌రెడ్డి తలమునకలై ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీకి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు. ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఉన్న సమయంలో పార్టీని పరుగులు పెట్టించినా రెండోసారి ఎంపీగా గెలిచాక కేంద్ర మంత్రిగా బాధ్యతలు ఇవ్వడంతో ఆయన సైతం దాదాపుగా హస్తినకే పరిమితమయ్యారు.

ఎమ్మెల్యేలు, ఎంపీలు సైలెంట్

బీజేపీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి పార్టీ బలమే కీలకం కానున్న నేపథ్యంలో పార్టీ యాక్టివిటీస్, నేతలు సైలెంట్ కావడంతో శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. గ్రౌండ్‌లో గట్టిగా కొట్లాడితేనే పార్టీకి భవిష్యత్ ఉన్న నేపథ్యంలో స్టేట్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు, వ్యూహాలు అమలు చేస్తుందో చూడాల్సి ఉన్నది.

దేశ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వచ్చే నెల 1వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టనున్నది. దేశ వ్యాప్తంగా కొత్తగా 10 కోట్ల మందిని సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా నమోదు ప్రక్రియ సాగనున్నది. ఒక్క తెలంగాణలోనే 50 లక్షల సభ్యత్వాలను టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం నాయకులు, కార్యకర్తలకు వర్క్‌షాప్ నిర్వహించి దిశానిర్దేశం చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. సభ్యత్వ నమోదు చేసుకున్నంత మాత్రాన పార్టీ బలోపేతమయినట్లేనా? సభ్యత్వాలన్నీ ఓట్లుగా మారుతాయా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక సంస్థల్లో సత్తా చాటితేనే తెలంగాణలో పార్టీ బతికేందుకు ఆస్కారముందనే టాక్ వినిపిస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed