చామల కిరణ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్

by Rajesh |
చామల కిరణ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజాసమస్యలను పక్కన కాంగ్రెస్ పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులు చేస్తోందని, వారికి కావాలంటే కేసీఆర్, కేటీఆర్‌ను తమ పార్టీలో చేర్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, కాకపోతే విలువలతో కూడిన రాజకీయం చేయాలని చెబుతున్నామని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

వారేమి చామల కిరణ్‌లాగా పారాచూట్ నేతలు కాదని మండిపడ్డారు. ఇరువురు నేతలు అంచలంచెలుగా ఎదిగి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై పోరాటంతో పైకి వచ్చారని పేర్కొన్నారు. తమ పార్టీలోకి ఎవరు వచ్చిన రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికల్లో కొట్లాడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించినా దాన్ని కూడా కాంగ్రెస్ నేతలు గౌరవించట్లేదని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఇదే తరహాలో వ్యవహరించి ఇప్పుడు ఎక్కడ ఉందో చూస్తున్నామని పాయల్ శంకర్ వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేతలు దృష్టిపెట్టాలని సూచించారు.

ఏడు నెలలైనా పాలన గాడిన పడలేదన్నారు. నిరుద్యోగుల సమస్యలకు మద్దతుగా ఎవరైనా దీక్ష, నిరసన తెలిపే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి నిరుద్యోగులను పిలిచి మాట్లాడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. గతంలో రేవంత్ మద్దతు తెలిపి దీక్షలకు కూర్చున్నప్పుడు ఏ పరీక్ష రాస్తున్నాడో సమాధానం చెప్పాలని చురకలంటించారు. నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. నిరుద్యోగులు కాస్త టైమ్ కావాలని అడుగటంలో తప్పేముందని, చదువుకునేందుకు సమయం ఇవ్వొచ్చు కదా అని పాయల్ శంకర్ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed