దమ్ముంటే కూల్చివేతలు అక్కడినుంచి ప్రారంభించండి.. హైడ్రాకు ఏలేటి సవాల్

by Gantepaka Srikanth |
దమ్ముంటే కూల్చివేతలు అక్కడినుంచి ప్రారంభించండి.. హైడ్రాకు ఏలేటి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు దమ్ము ఉంటే హైదరాబాద్‌లోని పాతబస్తీలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి సవాల్ చేశారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏలేటి మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక హైడ్రాతో హంగామా సృష్టిస్తున్నారని విమర్శించారు. కొంతమంది టార్గెట్‌గా హైడ్రా పని చేస్తుందనే అనుమానం వస్తోందని అన్నారు. ఇంత హంగామా చేస్తున్న హైడ్రా అధికారులకు సల్కం చెరువులో ఉన్న ఓవైసీ భూములను కూల్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. ‘కమిషనర్‌కు కనిపించకుంటే నేను వచ్చి చూపిస్తా. మీ దగ్గర తగిన జేసీబీలు లేకుంటే నేనే పక్క రాష్ట్రం నుంచి తెప్పించి ఇస్తా. ఓల్డ్ సిటీ గుర్రం చెరువు, జల్ పల్లి చెరువు అక్రమ నిర్మాణాల వివరాలు ఉన్నాయా? పంపించలా? ఓల్డ్ సిటీలో ఇష్టానుసారంగా చెరువు గుట్టలను కబ్జా చేశారు. గత ప్రభుత్వం కళ్ళు మూసుకుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీ నుంచి కూల్చివేతలు ప్రారంభించాలి’ అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వారి మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా? అని అడిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యప్ప సొసైటీ విషయంలో హైడ్రామా చేసింది. మీరు అదే విధంగా చేస్తున్నారేమో అనే అనుమానం వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న చెరువులు ఎన్ని? ఆక్రమణకు గురైన చెరువులు ఎన్ని? అనే విషయం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతం అయిన భూముల లెక్కపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలిపారు. మీ దగ్గర లెక్క ఏమైనా ఉందా? రంగనాధ్‌పై దానం చేసిన వ్యాఖ్యలపై చర్యలేవీ? అని అడిగారు. మీరు కూలగొట్టిన భూముల లెక్క చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఎండోమెంట్ భూముల మీద దృష్టి పెట్టాలని సూచించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు. నిజంగా నీవు ప్రజాప్రతినిధి అయితే స్వచ్ఛందంగా మీ కట్టడాలు మీరే కూల్చండి అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.

Advertisement

Next Story