రంజాన్‌కు రూ.33 కోట్లు.. మరి హిందూ దేవాలయాలపై పట్టింపేది: ఎన్వీ సుభాష్

by Satheesh |
రంజాన్‌కు రూ.33 కోట్లు.. మరి హిందూ దేవాలయాలపై పట్టింపేది: ఎన్వీ సుభాష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం హిందువులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని, ఈ బడ్జెట్‌లో హిందు ఆలయాలకు ఎలాంటి కేటాయింపులు చేపట్టలేదని, అదే రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వ‌ర్గాల‌ను నిరాశప‌రిచిందన్నారు. సంక్షేమాన్ని నీరుగార్చేలా, అభివృద్ధిని అగమ్యగోచరంగా మార్చివేసేలా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి రూ.3000 కోట్లు, రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు, హజ్ యాత్రికుల కోసం రూ.4 కోట్లకు పైగా నిధులు కేటాయించిందన్నారు.

మతోన్మాద తబ్లిగీ జమాత్ సంస్థకు రూ. 2.4 కోట్లు కేటాయించిందని, ఈ కేటాయింపులతో కాంగ్రెస్ తన ప్రధాన ఓటు బ్యాంకుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్కారు దారిలోనే వెళ్తోందన్నారు. అనేక చోట్ల హిందూ దేవాలయాలకు సంబంధించి వందలాది ఎకరాల భూములను దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వ్యాపార సంస్థలకు అత్యంత చౌకధరకు కట్టబెట్టడుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ పండుగలపై వివక్ష చూపుతోందన్నారు. ఎన్నికల సమయంలో గ్యారెంటీల పేరుతో గారడీ చేసి.. బడ్జెట్ లో అంకెల మాయ చేసి ప్రజలను మోసం చేశారని ఎన్వీ సుభాష్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story