119 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్ : Bandi Sanjay Kumar

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-23 08:01:58.0  )
119 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్ : Bandi Sanjay Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం బూత్ స్వశక్తికరణ్ అభియాన్‌పై నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. 119 సెగ్మెంట్లలో చాలా చోట్లు గెలుస్తామని ఆయన పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని నేతలకు వివరించారు.

వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన నొక్కిచెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ బీజేపీ అని ఆయన తెలిపారు. ప్రజలకు కేసీఆర్ పాలనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని ఆయన విమర్శలు చేశారు. ప్రజాపాలనను గాలికొదిలేసి నియంత పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.

కుటుంబాలను, చిన్న పిల్లలను సైతం బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని ప్రజలు భావిస్తున్నారని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ చరిత్ర ఒక్కసారి చూడండని, ఏ పార్టీకి పోలింగ్ బూత్‌లు, శక్తి కేంద్రాలు లేవని ఆయన పేర్కొన్నారు. సంస్థాగతంగా బలోపేతం కావడం వల్లే 18 రాష్టాల్లో అధికారంలోకి వచ్చామని, నేతల కృషితో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్నారు.

ఇప్పటివరకు 80 శాతం మండల కమిటీలు, శక్తికేంద్రాలు, బూత్ కమిటీలు ఏర్పాటు చేసినట్లు బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, దీనికి దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనమని ఆయన స్పష్టంచేశారు. స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెట్టడం వల్ల స్థానిక ప్రజలకు బీజేపీపై నమ్మకం ఏర్పడిందని బండి తెలిపారు.

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా కేంద్రప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సైతం ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని ఆయన సూచించారు. అభివృద్ధిపై చర్చ జరగాల్సిన సమయంలో వివక్షకు దారితీసేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.బీజేపీలో కష్టపడి, ఇష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటామని, నేతలంతా దీన్ని అనుసరించి ఇబ్బందులను అధిగమించాలని, ప్రజలకు, కార్యకర్తలకు భరోసా కల్పించాలని బండి దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed