బిగ్ న్యూస్: కేసీఆర్‌ను ఇరుకునపెట్టేందుకు BJP మరో ప్లాన్.. ఆ ఓటర్లే టార్గెట్‌గా సరికొత్త వ్యూహాం!

by Satheesh |   ( Updated:2023-03-30 00:31:03.0  )
బిగ్ న్యూస్: కేసీఆర్‌ను ఇరుకునపెట్టేందుకు BJP మరో ప్లాన్.. ఆ ఓటర్లే టార్గెట్‌గా సరికొత్త వ్యూహాం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ ఓటర్లే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. బీసీ కులస్తులకు చేరువయ్యేందుకు కాషాయదళం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. తెలంగాణలో దాదాపు 50 లక్షలకు పైగా బీసీ కుటుంబాలున్నాయి. కాగా వారిని తమ వైపునకు ఆకర్షితులయ్యేలా కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ‘పల్లె పల్లెకూ ఓబీసీ.. ఇంటింటికీ బీజేపీ’ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ యాక్టివిటీని ముమ్మరంగా చేపట్టాలని చూస్తోంది. దాదాపు తొమ్మిది రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ కార్యాచరణను చేపట్టనుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రారంభించనున్నారు.

తెలంగాణలో తొమ్మిదేండ్లలో కేసీఆర్ సర్కార్ బీసీలకు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించాలని ఓబీసీ మోర్చా నేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగా బీసీలకు రాష్ట్ర సర్కార్ చేసిన అన్యాయాలపై ఒక కరపత్రాన్ని రూపొందించి ఆ వర్గానికి చెందిన ప్రజలకు చేరువయ్యేలా బీజేపీ ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా పరంగా, సామాజిక పరంగా, ఉద్యోగం, ఉపాధి వంటి అంశాలపై ప్రధానంగా ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం బీసీలకు అందించిన సంక్షేమ పథకాలతో పాటు కేసీఆర్ సర్కార్ వారికి చేసిన మోసాలను సైతం వివరించేలా కరపత్రాన్ని సిద్ధంచేసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీలను అణిచివేసిన తీరుపై వివరించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను దాదాపు 10 శాతం తగ్గించి 23 శాతానికి కుదించింది. బీసీలు రాజకీయంగా ఎదగకుండా వారిని అణిచివేసే కుట్రలో భాగంగానే కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

2014లో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సర్వే ద్వారా రాష్ట్రంలో బీసీ జనాభా, వారి స్థితిగతులు, ఆర్థిక వెనుకబాటుతనం అన్ని వివరాలు సేకరించిన ప్రభుత్వం దానిని ఎందుకు బహిర్గతం చేయడంలేదనే అంశాన్ని లేవనెత్తనున్నారు. స్థానిక సంస్థల్లో ముస్లింలను బీసీలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 32 మంది బీసీ సీట్లలో మైనారిటీలు ఎన్నికైన అంశాలను ప్రజలకు వివరించనుంది.

ఇక ఆర్థికపరంగా చూసుకుంటే బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిందే లేదని బీజేపీ విమర్శలు చేస్తోంది. మొదటి టర్మ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడి చేసి 50 వేల లోపు రుణాలు అరకొరగా ఇచ్చి ఓట్లు దండుకున్నారని, రెండోసారి ప్రభుత్వం వచ్చాక అసలు బీసీ రుణాలే మరచిపోయిందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి రూ.6100 కోట్లు కేటాయించి అందులో రూ.494 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి రూ.2500 కోట్లు కేటాయించి ఇప్పటి వరకు రూ.354 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కాగా అందులో ఖర్చు చేసింది కూడా కేవలం రూ.7 కోట్లే.

విద్యాపరంగా రాష్ట్రంలోని బీసీలకు చదువును దూరం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బీసీ గురుకులాల్లో ఇప్పటికీ టీచర్ పోస్టులు ఖాళీలున్నాయి. గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిన పాపాన కూడా ప్రభుత్వం పోలేదని విమర్శలు వస్తున్నాయి.

గురుకులాల మీద గొప్పలు చెప్పే ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 శాతానికి పైగా ఉన్న బీసీ విద్యార్థులకు 261 బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తే 12 శాతం ఉన్న మైనారిటీలకు 192 గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇది బీసీలను అణిచివేసే కుట్ర కాదా అని కమలదళం ప్రశ్నించనుంది.

బీసీలకు సామాజిక న్యాయం కూడా దక్కడంలేదని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీ ఆత్మగౌరవ భవనాల పేరిట చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ పూర్తికాలేదు. కేసీఆర్ సామాజికి వర్గానికి మాత్రం హైటెక్ సిటీ వద్ద దాదాపు ఎకరం రూ.60 కోట్లు విలువ చేసే ప్రాంతంలో 5 ఎకరాలు కేటాయించారని విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ వస్తే ఉద్యోగం, ఉపాధి దొరుకుతుందని భావిస్తే కేసీఆర్ బర్లు, గొర్ల పెంపకానికే పరిమితం చేస్తోందని ప్రజలకు వివరించాలని బీజేపీ భావిస్తోంది.

బీసీలు.. కేసీఆర్ సర్కార్‌కు గుణపాఠం చెప్పాలి

తెలంగాణలో అడుగడుగునా బీసీలకు అన్యాయమే జరుగుతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇబ్బంది పడుతున్నారు. లక్షల మంది బీసీ యువకులు ఉపాధి కోసం, రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ప్రశ్నపత్రాలు లీక్ చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. బీజేపీ ఒక బీసీ నేతలను ప్రధానిని చేసింది. కేసీఆర్ కేబినెట్ లో ఉన్న బీసీ మంత్రులెందరు? ప్రగతిభవన్ లో బీసీ అధికారులెందరు? అన్ని విధాలా బీసీ సమాజం వివక్షకు గురవుతోంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి

= నందీశ్వర్ గౌడ్, పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే

Advertisement

Next Story

Most Viewed