మోడీ ప్రచారం చేసిన చోట్ల బీజేపీ ఆధిక్యం

by Rajesh |
మోడీ ప్రచారం చేసిన చోట్ల బీజేపీ ఆధిక్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో మోడీ 8 లోక్ సభ స్థానాల్లో ప్రచారం చేపట్టారు. కాగా అందులో 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లో కమలం పార్టీ ఆధిక్యంలో ఉంది. మోడీ ప్రచారం చేపట్టిన జహీరాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, హైదరాబాద్ లోక్ సభ స్థానాల్లో బీజేపీ వెనుకంజలో ఉంది. నాగర్ కర్నూల్ స్థానంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి లీడ్ లో ఉన్నారు. నాగర్ కర్నూల్ లో 9వ రౌండ్ ముగిసేసరికి మల్లు రవి 20,987 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 2,05,918 ఓట్లు వచ్చాయి. కాగా బీజేపీ అభ్యర్థి భరత్ కు 1,84,931 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 1,51,716 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అయితే చివరి వరకు ఈ స్థానంలో కూడా బీజేపీ ఆధిక్యంలోకి వస్తుందా? లేదా? అనేది చూడాలి. వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య లక్షకు పైగా మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతోంది. జహీరాబాద్ లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది.

తెలంగాణలో ప్రధాని మోడీ ఏప్రిల్ నుంచి మే వరకు మూడు నెలల్లో మొత్తం 8 సార్లు తెలంగాణలో పర్యటించారు. మోడీ తొలుత మల్కాజ్ గిరిలో రోడ్ షో నుంచి తెలంగాణలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో తెలంగాణ కేడర్ లో జోష్ నింపారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని తెలంగాణలో అత్యధిక పర్యటనలు సాగించారు. మార్చిలో ఐదుసార్లు, ఏప్రిల్ లో ఒకసారి, మేలో రెండుసార్లు మోడీ తెలంగాణలో పర్యటించారు. మార్చి 4న ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. మార్చి 5న సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని సంగారెడ్డికి వెళ్లారు. సంగారెడ్డి పటాన్ చెరులో పలు అభివృద్ధి పనులతో పాటు పబ్లిక్ మీటింగ్ కు హాజరయ్యారు. మార్చి 15న మల్కాజ్ గిరిలో రోడ్ షో నిర్వహించారు. మార్చి 16న నాగర్ కర్నూల్ లో బీజేపీ ప్రచార సభలో మోడీ పాల్గొన్నారు. మార్చి 18న జగిత్యాలలో నిర్వహించిన బహిరంగ సభకు మోడీ హాజరయ్యారు. ఏప్రిల్ 30న జహీరాబాద్ ఆందోల్ లో, మే 8న వేములవాడ, వరంగల్ ప్రచార సభల్లో మోడీ పాల్గొన్నారు. మే 10న మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేటలో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభతో ప్రచారానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

Advertisement

Next Story