తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ?

by Mahesh |
తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారనుందా? ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న ఆ పార్టీ.. బీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకోబోతున్నారా..? గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని కోల్పోనున్నాదా? రెండో అతి పెద్ద పార్టీ స్థాయి నుంచి సింగిల్ డిజిట్‌కు పరిమితం కానున్నదా? పాతికమందికి పైగా ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్‌ఎల్పీని కాంగ్రెస్ విలీనం చేసుకోనున్నదా? అనే చర్చలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాల నాటికి బీజేపీ కనీసంగా పన్నెండు మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందనున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. పదేండ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షాల గొంతు వినిపించొద్దని కోరుకున్న బీఆర్ఎస్.. ప్రస్తుతం అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా మారే అవకాశాలు ఏర్పడబోతున్నాయని చర్చలు జరుగుతున్నాయి.

దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్

అసెంబ్లీ సమావేశాల నాటికి రాష్ట్రంలోని రాజకీయాలు మరింత మలుపు తిరుగుబోతున్నాయనే చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్.. ఈ నెల చివరికల్లా థర్డ్ ప్లేస్‌కే పరిమితం అయ్యే అవకాశాలున్నాయనేది ఆ మాటల వెనక ఉద్దేశం. ప్రస్తుతం మెయిన్ అపోజిషన్ ఉన్న బీఆర్ఎస్ థర్ట్ ప్లేస్‌కు పడిపోయి.. ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎనిమిది మంది సభ్యులున్న బీజేపీ.. మరో నలుగురి చేరికతో మెయిన్ అపోజిషన్ హోదాను చేజిక్కించుకోనున్నదనే ధీమా కాషాయ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

బీఆర్ఎస్ఎల్పీ విలీనంపై కాంగ్రెస్ ఫోకస్

మరో వైపు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్.. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లోక్‌సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు సైతం గెల్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలనూ కాపాడుకోలేకపోతున్నది. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌజ్ దాటడంలేదంటూ ఆయనపై సొంత పార్టీ లీడర్లే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోగా ఈ వారంలో మరికొందరి చేరిక కోసం సంప్రదింపులు పూర్తయ్యాయి. లాంఛనంగా కండువా కప్పుకోవడమే తరువాయి.

ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్ నాటికి బీఆర్ఎస్‌‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం దిశగా పరిణామాలు మారుతున్నాయి. ఇక బీఆర్ఎస్ సంఖ్యాబలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌ కన్నా కేవలం 1.8% ఓట్లు మాత్రమే తమకు తక్కువగా వచ్చాయని, మ్యాజిక్ ఫిగర్‌ కన్నా కేవలం నాలుగైదు సీట్లే కాంగ్రెస్ ఎక్కువ రాబట్టుకోగలిగిందంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు కామెంట్ చేశారు. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, ప్రజల పక్షాన ఉంటామని గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఎన్ని బుజ్జగింపులు చేసినా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో కొనసాగడం కష్టంగా మారింది.

మిగిలేది ఆ అరడజను మందేనా?

కడియం శ్రీహరితో మొదలైన ఆ పార్టీలోని లుకలుకలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ళ), తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరికదాకా దారితీశాయి. నేడో రేపో ఆలంపూర్ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో బీఆర్ఎస్.. టీడీపీ, కాంగ్రెస్ శాసనసభాపక్షాలను విలీనం చేసుకున్నది. ప్రస్తుతం అదే తీరే రివర్సులో ఎదుర్కొంటున్నది. శాసనమండలిలో అతి పెద్ద పార్టీగా ఉన్న స్థానం సైతం ఎన్ని రోజులుంటుందో... అనే చర్చలు మొదలయ్యాయి. ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిపోవడం గులాబీ పార్టీని గుక్క తిప్పుకోకుండా చేసింది. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోతారనే చర్చ కన్నా.. ఎంతమంది మిగులుతారనేది డిస్కషన్ మొదలైంది. బీఆర్ఎస్‌లో మిగిలేది ఆ అరడజను మందేనా?.. అంటూ సెటైర్లు సైతం వినిపిస్తున్నాయి.

చేరికలపై బీజేపీ ధీమా..

పార్టీలో చేర్చుకోడానికి తాము వ్యతిరేకం కాదంటున్న బీజేపీ నేత బండి సంజయ్ (కేంద్ర సహాయ మంత్రి)... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటున్నారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఢిల్లీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి అవకాశం లేక, వెళ్లాలనుకున్నా జిల్లాలోని పరిణామాలతో అందులో ఇమడలేక బీజేపీ వైపు చూస్తున్నారు. కనీసంగా నలుగురైనా బీజేపీలో చేరుతారని ఆ పార్టీ ధీమాతో ఉన్నది. అప్పుడే దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి మార్గం సుగమమవుతుంది. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలన్నది కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి లక్ష్యం. ఏక కాలంలో అటు బీఆర్ఎస్ స్థాయి పడిపోవడం, బీజేపీ మెయిన్ అపోజిషన్‌గా అవతరించడం త్వరలోనే జరుగుతాయన్న అంచనాలు హస్తం, కమలనాధుల్లో నెలకొన్నది. మొత్తంగా హస్తం, కాషాయం పార్టీల స్ట్రాటజీ తో గులాబీ పార్టీ దిక్కుతోచని స్థితిలో నలిగిపోతున్నది.

Advertisement

Next Story

Most Viewed